కోరుట్ల/కోరుట్లరూరల్: కోరుట్ల పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవితా బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం ప్రారంభించారు. పట్టణంలోని 13 వవార్డులో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డీఆర్‌డీఏ పీడీ రఘువరన్ పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దరఖాస్తులు స్వీకరించాలన్నారు. మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత, కమిషనర్ రాఘవేంద్ర, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు, పట్టణ అద్యక్షుడు తిరుమల గంగాధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యతోనే సామాజిక అభివృద్ధి
జగిత్యాల: విద్యతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేశ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఓల్డ్ హైస్కూల్‌లో బాల విజ్ఞాన ప్రదర్శన, ఇన్‌స్పైర్ అవార్డ్స్, జిల్లాస్థాయి పీఎంశ్రీ సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు సైన్స్‌ఫేర్‌ను అందిపుచ్చుకుని భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి మాట్లాడుతూ, విద్యార్థులు తమ చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపించే ఆవిష్కరణలు రూపొందించాలన్నారు. డీఈవో రాము మాట్లాడుతూ, విద్యార్థులను కేవలం పాఠ్యాంశ బోధనకు మాత్రమే పరిమితం చేయకుండా ప్రయోగాలు, పరిశోదనలు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన 300 ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఎస్‌కేఎన్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నాగభూషణం, జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల అభివృద్ధికి రూ.3 లక్షల విరాళం
కథలాపూర్: మండలంలోని బొమ్మెన ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి గ్రామస్తుడు పిడుగు సంజీవ్‌రెడ్డి రూ.3 లక్షలు విరాళం శుక్రవారం అందించారు. దాత ఇచ్చిన డబ్బులతో కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం కోసం గది నిర్మిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. అనంతరం గది నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. సర్పంచ్ చిందం సుధాకర్, హెచ్‌ఎంలు మధుకుమార్, అంబటి రవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హక్కులపై అవగాహన ఉండాలి
వెల్గటూర్: హక్కులపై అవగాహన ఉండాలని జిల్లా బాలల పరిరక్షణ ఇన్‌చార్జ్ అధికారి పడాల సురేశ్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు విజయలక్ష్మి అన్నారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండలంలోని కుమ్మరిపల్లి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులకు బాలల హక్కులు, పరిరక్షణ చట్టాలు తదితర అంశాలపై వివరించారు. అత్యవసర సందర్భాల్లో చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. అనంతరం విద్యార్థినులకు ఆటల పోటీలు, వ్యాసరచన తదితర పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచినవారికి బహుమతులు అందజేశారు. జిల్లా మహిళా సాధికారత కోఆర్డినేటర్ కొండయ్య, పరిరక్షణ అధికారి కరుణశ్రీ, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.


