జగిత్యాలటౌన్: డిప్యూటీ స్పీకర్ పదవిని గడ్డిపోచలా వదిలేసి ఉద్యమానికి ఊపిరులూది, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్‌ది త్యాగాల చరిత్ర అయితే.. గవర్నర్‌కు రాజీనామా సమర్పించకుండా తన నాయకుడు చంద్రబాబుకు రాజీనామా లేఖ సమర్పించి ఎమ్మెల్యే పదవిని పట్టుకుని వేలాడి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన చరిత్ర రేవంత్‌రెడ్డిదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ భవన్‌లో దావ వసంతతో కలిసి మాట్లాడారు. సిద్దిపేట జిల్లా సాగుమయమవుతుంటే ఓర్వలేని రేవంత్ అక్కసుతో హరీశ్‌రావుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హరీశ్ పాల వ్యాపారం చేస్తున్నారని మాట్లాడుతున్న రేవంత్‌కు తన గురువు చంద్రబాబు హెరిటేజ్ పేరిట పాల వ్యాపారం చేస్తున్న సంగతి తెలియదా అని నిలదీశారు. పాడి రైతులకు అండగా నిలిచేందుకు పాల వ్యాపారం చేయడం తప్పా అని ప్రశ్నించారు. ఎనుముల, పొంగులేటి కుటుంబాల భూములు, బ్లాక్ మెయిల్ దందాలు ప్రజలందరికీ తెలుసున్నారు. 2007లో శాసనమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు రేవంత్‌కు ఉన్న ఆస్తులెన్ని ఇప్పుడున్న ఆస్తులెన్నో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ రైతుబంధును కనుమరుగు చేసే కుట్రలో భాగంగానే కుటుంబ జీవిత బీమా పథకం అంటున్నారని విమర్శించారు. రేవంత్ మాటల్ని ప్రజలు విశ్వసించడం లేదని రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం తప్పదన్నారు. సమావేశంలో తాటిపర్తి విజయలక్ష్మి, గాజుల రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, ధర రమేశ్‌బాబు, చందా రాధాకిషన్‌రావు, సురేందర్, మహ్మద్‌భారి, ఒల్లం మల్లేశం పాల్గొన్నారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి


