ఆద్యంతం.. ఉత్కంఠ భరితం | - | Sakshi
Sakshi News home page

ఆద్యంతం.. ఉత్కంఠ భరితం

Nov 21 2026 12:08 AM | Updated on Nov 21 2026 12:08 AM

మెట్‌పల్లిరూరల్‌: నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఘర్షణ.. తర్వాత మంత్రి అడ్లూరి పర్యటన.. దీంతో ఏం జరుగుతోందనన్న ఉత్కంఠ. ఈ పరిస్థితుల్లో మెట్‌పల్లి పట్టణంలో శుక్రవారం నూతన చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మొదట కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌, తర్వాత మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ జువ్వాడి నర్సింగరావు వేదిక వద్దకు చేరుకున్నారు. ఇరుపార్టీల కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్న విషయాన్ని గ్రహించిన ఎమ్మెల్యే రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని కార్యక్రమం ప్రశాంతంగా చేసుకుందాం అని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులను కోరారు. కాగా, వేదిక వద్దకు మంత్రి అడ్లూరి చేరుకోగానే కాంగ్రెస్‌ నాయకులు ‘జైనర్సింగన్న’ అని, బీఆర్‌ఎస్‌ నాయకులు ‘జై సంజయన్న’ అంటూ పోటాపోటీ నినాదాలతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రెండు వర్గాలను మంత్రి సముదాయించడంతో నాయకులు శాంతించారు. డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు.

అర్హులందరికీ సామాజిక భద్రత

అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పథకాలు అందజేస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు. మెట్‌పల్లి పట్టణంలోని ఆరపేట సమీపంలో ఓ ఫంక్షన్‌ హాల్‌లో లబ్ధిదారులకు పెన్షన్‌ మంజూరు పత్రాలు అందజేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి అన్ని చర్యలు చేపడుతున్నారన్నారు. కొందరికీ పెన్షన్లు రాలేదని తన దృష్టికి వచ్చిందని వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, పెన్షన్లు ఆర్థికంగా భరోసానిస్తాయని అర్హులందరికీ వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. అర్హత ఉండి పెన్షన్లు రాకుంటే ఆందోళన చెందవద్దని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. అలాంటి వారి దరఖాస్తులు పరిశీలించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. డీఆర్‌డీవో రఘువరన్‌, కోరుట్ల ఆర్డీవో జివాకర్‌, తహసీల్దార్‌ ముఫ్తార్‌పాషా, మెట్‌పల్లి, కోరుట్ల మున్సిపల్‌ చైర్మన్లు లింబాద్రి, వసంత, కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు రైసొద్దిన్‌ తదితరులు పాల్గొన్నారు.

మెట్‌పల్లిలో ఉత్కంఠగా సాగిన చేయూత పెన్షన్ల పత్రాల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement