అగ్రిగోల్డ్ కుంభకోణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన భారీ ఆర్థిక మోసం. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో లక్షలాది మంది ప్రజలు ఈ సంస్థ బారినపడ్డారు. మధ్యతరగతి, పేద కుటుంబాలు, రైతులు, చిరుద్యోగులు తమ కష్టార్జితాన్ని చిన్న మొత్తాలుగా పొదుపు చేసి సంస్థలో డిపాజిట్ చేశారు. నిర్దిష్ట కాలానికి డబ్బు జమ చేస్తే అధిక వడ్డీతో తిరిగి చెల్లిస్తామని, గడువు ముగిసిన తర్వాత తక్కువ ధరకు ప్లాట్లు లేదా వ్యవసాయ భూములు ఇస్తామని సంస్థ నమ్మబలికింది. ఇందుకోసం 130కి పైగా అనుబంధ కంపెనీల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించింది. అయితే గడువు ముగిసినా తిరిగి చెల్లించకపోవడం, హామీ ఇచ్చిన భూములు కేటాయించకపోవడంతో 2014లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. భారీ మొత్తంలో ప్రజాధనం దుర్వినియో గం కావడంతో దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగా యి. 2018లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు దర్యాప్తు చేపట్టి సంస్థకు చెందిన పలు ఆస్తులను అటాచ్ చేసింది. బాధితులకు న్యాయం చేసే క్రమంలో ఈ ఆస్తులను వారికి బదిలీ చేసేందుకు న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో బాధితుల గుర్తింపు, పెట్టుబడుల వివరాల సేకరణపై ఏపీ సీఐడీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కరీంనగర్‌లోనూ ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి వెరిఫికేషన్ చేపట్టనున్నారు.


