గోడు వినండి.. గోస తీర్చండి | - | Sakshi
Sakshi News home page

గోడు వినండి.. గోస తీర్చండి

Nov 17 2026 12:14 AM | Updated on Nov 17 2026 12:14 AM

● అర్జీలు స్వీకరించిన డీఆర్వో ప్రసాద్‌ ● ఫిర్యాదులు పరిష్కరించాలని ఆదేశాలు

● ప్రజావాణికి 83 దరఖాస్తులు రాక

జగిత్యాల: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను

వెంటనే పరిష్కరించాలని డీఆర్వో కేవై.ప్రసాద్‌ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. 83 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆర్డీవోలు జివాకర్‌రెడ్డి, నర్సింహారావు, జిల్లా అధికారులు, కమిషనర్లు పాల్గొన్నారు.

చంపేస్తామని బెదిరిస్తున్నరు

నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ముగ్గు పోయకుండా గ్రామంలో కొందరు అడ్డుకుంటున్నారు. చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇందిరమ్మ ఇంటిని అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి. (ఇందిరమ్మ ఇంటిని అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని లక్ష్మీ నిద్రమాత్రలు వెంట తెచ్చుకోగా అధికారులు గుర్తించి తీసుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.)

– గుగులోతు లక్ష్మీ,

వేములకుర్తి, ఇబ్రహీంపట్నం మండలం

చిన్న కుమారుడు పట్టించుకుంటలేడు

మాకు ఇద్దరు కుమారులు. వారు పట్టించుకోకపోవడంతో వారిపై ఆర్డీవోకు ఫిర్యాదు చేసినం. మాకు ప్రతినెలా చెరి రూ.3 వేల చొప్పున ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. పెద్ద కుమారుడు రూ.3వేలు ఇస్తున్నా.. చిన్న కుమారుడు ఇవ్వడం లేదు. మాకు వైద్యం, ఇతరత్రా ఖర్చులకు ఇబ్బందిగా మారింది. ఆర్డీవో ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్న కుమారుడిపై చర్యలు తీసుకోండి. మా భూమి మాకు ఇప్పించండి.

– గంగన్న, కుంటవ్వ,

మల్లన్నపేట, గొల్లపల్లి మండలం

జీవనోపాధి పరిరక్షించాలి

మేం మత్స్యకారులం. ల్యాగలమర్రిలోని కంబటి కుంటలో చేపలు పట్టుకుని జీవనోపాధి పొందుతున్నాం. కొందరు మాకు ఆటంకం కలిగిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి. కుంటను పరిరక్షించాలి. సొంత పెట్టుబడితో చేప పిల్లలను కొనుగోలు చేసి కుంటలో పెంచుకుంటున్నాం. కొందరు కుంటలో చేపలు పట్టొద్దంటూ హుకూం జారీ చేస్తున్నారు. సమస్యను అధికారులు పరిష్కరించాలి.

– మత్స్య పారిశ్రామిక సంఘం నాయకులు, ల్యాగలమర్రి

డంపింగ్‌యార్డు తొలగించాలి

ఇబ్రహీంపట్నం మండలం గోదూరు సమీపంలో డంపింగ్‌యార్డు ఉండటంతో ఇబ్బందికరంగా మారింది. నిత్యం మెట్‌పల్లి నుంచి చికెన్‌, మటన్‌ వ్యర్థాలు, ప్లాస్టిక్‌ కవర్లు తెచ్చి ఇక్కడ పడేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త తగలబడి పొగ వస్తోంది. పంట పొలాలకు, పాఠశాలలకు సైతం ఇబ్బందిగా మారింది.

– వైశాలి, అద్విత, గోధూరు, ఇబ్రహీంపట్నం

పిల్లలను ఇబ్బంది పెడుతున్నారు

రాయికల్‌లోని విశ్వశాంతి పబ్లిక్‌ స్కూల్‌లో నా కొడుకు దివాన్ష్‌ 10వ తరగతి, కూతురు మహిత 6వ తరగతి చదువుతున్నారు. నేను ఏటా సక్రమంగానే ఫీజు చెల్లిస్తున్నా. ఈ ఏడాది చెల్లించలేదని స్కూల్‌ యజమాన్యం పిల్లలను ఆరుబయట నిలబెట్టింది. కొడుకుతో ముక్కు భూమికి రాయించి శిక్షించారు. స్కూల్‌ ఫీజు చెల్లిస్తామని చెప్పినా వినలేదు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.

– గోలి తిరుపతి, బోర్నపల్లి

రోడ్లను ఆక్రమించుకుంటున్నారు

డబ్బా గ్రామంలో పాత గ్రామపంచాయతీ వెనకాల నుంచి రామాలయం వరకు గల రోడ్డు గడ్డిమైసమ్మ బురుజు నుంచి లంబాడి తండా వరకు గల రోడ్డును ఆక్రమించుకుంటున్నారు. ఎలాంటి పర్మిషన్లు లేకున్నా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. సెట్‌బ్యాక్‌ లేకుండా నిర్మించడంతో రోడ్లు ఇరుకుగా మారుతున్నాయి. సమగ్ర విచారణ చేపట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి.

– గోపినాథ్‌ అనిల్‌, డబ్బా, ఇబ్రహీంపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement