చెరువులు కబ్జా..! | - | Sakshi
Sakshi News home page

చెరువులు కబ్జా..!

Nov 14 2026 12:53 AM | Updated on Nov 14 2026 12:53 AM

● యథేచ్ఛగా ఆక్రమణ ● పరిరక్షణకు చర్యలు ● అమృత్‌ 2.0 పథకం కింద నిధులు మంజూరు

జగిత్యాల: జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. మోతె, అంతర్గాం, చింతకుంట, కండ్లపల్లి, గోవిందుపల్లి గొలుసుకట్టు చెరువులు ఉన్నందున జగిత్యాలను ఫైవ్‌ పాండ్స్‌ ఆఫ్‌ సిటీ అని పిలుస్తారు. జగిత్యాల జిల్లా కేంద్రం కావడం, భూముల ధరలు పెరిగిపోవడం, పైగా సిటీనే ఆనుకుని చెరువులు ఉండటంతో ఎఫ్‌టీఎల్‌లో, బఫర్‌ జోన్లలో కొందరు నిర్మాణాలు చేపట్టారు. వీటిని ఆనుకుని ఉన్న కాలువలు కూడా కబ్జాకు గురయ్యాయి. మోతె, చింతకుంట చెరువుల సమీపంలో చాలా వరకు శిఖం భూమి ఆక్రమణకు గురైంది.

చెరువుల పరిరక్షణకు నిధులు

మున్సిపాలిటీల్లో చెరువులు ఎక్కువగా ఆక్రమణకు గురికావడంతో పాటు, పిచ్చిమొక్కలతో కళాహీనంగా మారాయి. వీటిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అమృత్‌ 2 కింద నిధులు మంజూరయ్యాయి. జిల్లా కేంద్రంలోని మోతె, చింతకుంట చెరువులతో పాటు, రాయికల్‌, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పల్లిలో ఒక్కో చెరువుకు రూ.18.84 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాగా, జగిత్యాలలోని రెండు చెరువుల పనులు ఇంకా మొదలుకాలేదు.ప్రారంభించారు.

హైడ్రా తరహాలో..

జిల్లాలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తేనే ఆక్రమణకు గురైన చెరువులు స్వాదీనం చేసుకునే అవకాశం ఉంటుంది. బఫర్‌ జోన్ల పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. గతంలో బఫర్‌ జోన్‌ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు జరిగాయి. చింతకుంట చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయగా, కట్ట సమీపంలో చాలా అక్రమ కట్టడాలు వెలిశాయి. అమృత్‌ 2.0 పథకం కింద పటిష్ట చర్యలు తీసుకుంటే చెరువులు కబ్జాకు గురికాకుండా ఉంటాయి.

మురుగు సమస్య

మురికినీరు చెరువుల్లో చేరకుండా మళ్లించడం, నీటి కాలుష్యాన్ని నివారించడం, చెరువు నీటి నాణ్యతను కాపాడితేనే ప్రజలకు ఉపయోగపడతాయి. భూగర్భజలాల పెంపు, పర్యావరణ సమతుల్యత, గంగపుత్రుల జీవనోపాధికి ఇవి ఎంతో కీలకం. కాగా, సివరేజీ ట్రీట్మెంట్‌ ప్లాంట్లు లేకపోవడం, డ్రెయినేజీ నీరంతా చెరువుల్లోకి వెళ్లి నీరంతా కలుషితం కావడంతో అటు మత్స్యకారులు, ఇటు తాగునీటికి ఇబ్బందికరంగా మారింది. కొందరు చెరువుల్లోనే చికెన్‌ వ్యర్థాలు, చెత్తాచెదారం పడేయడంతోపాటు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి.

చర్యలు తీసుకుంటాం

చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. చెరువుల చుట్టూ బఫర్‌ జోన్లు, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఇళ్ల నిర్మాణాలు మా దృష్టికి వచ్చింది. చెరువుల పరిరక్షణకు పూర్తిస్థాయిలో సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

– సత్యప్రసాద్‌, కలెక్టర్‌

ప్రణాళికతో అభివృద్ధి

చెరువుల అభివృద్ధికి అమృత్‌ 2.0 పథకం కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. చెరువులు, పరిసరాల ప్రాతాలు అభివృద్ధి చేస్తున్నాం. చెరువుల్లో మురికినీరు కలవకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నాం. – సంజయ్‌కుమార్‌, ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement