గడి బురుజుల స్థలంపై
ముదురుతున్న వివాదం
● అక్రమ వీఎల్‌టీల రద్దుకు పెరుగుతున్న డిమాండ్
● స్థలం కోరుట్ల వారసత్వ సంపద అంటున్న బీఆర్‌ఎస్
● నేటి నుంచి ఆందోళనకు సిద్ధమైన పార్టీ శ్రేణులు
కోరుట్ల: పట్టణంలోని గడి బురుజుల స్థల వివాదం కొత్త మలుపు తిరిగింది. ఆ స్థలం కోరుట్లకు వారసత్వ సంపదగా దక్కాల్సిందేనని కొంతకాలంగా వాదిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీ.. తాజాగా క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధమైంది. వారంపాటు ఒక్కో రోజు ఒక్కోతీరున నిరసనలు, ఆందోళనలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గడి బురుజుల స్థలం కోరుట్లకు చెందాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో స్థానిక కుల సంఘాలు, పార్టీ శ్రేణులతో స్థలం వద్దనే పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు.
కోరుట్లకే దక్కాలని నిరసనలు..
పురావస్తు శాఖ వివాదాస్పద ఉత్తర్వులు, మున్సిపల్ వీఎల్‌టీలతో నెల క్రితం గడి స్థలంలో రిజిస్ట్రేషన్లు కావడం చర్చనీయాంశంగా మారింది. గడి స్థలానికి వీఎల్‌టీ రద్దు చేయాలని, వారసత్వ సంపదగా ఉంచాలని కోరుట్ల భూ పరిరక్షణ కమిటీ అధ్వర్యంలో నిరసనలతో పాటు ఉన్నతాధికారులు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయంలో ఎమ్మెల్యే సంజయ్ జోక్యం చేసుకు వీఎల్‌టీ రద్దు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. ఏళ్ల తరబడి స్థలం ఖాళీగా ఉండడం.. దసరారోజు మహిషాసురమర్థిని కార్యక్రమానికి వాడుకుంటున్న నేపథ్యంలో ఈ స్థలం కోరుట్ల ఆబాది కింద వస్తుందని, మున్సిపాల్టీకి కేటాయించాలని బీఆర్‌ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మొదటగా కులసంఘాల సమావేశం, పోస్టుకార్డు ఉద్యమం, ధర్నాలు, కోరుట్ల బంద్ వంటి ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో గడి బురుజుల స్థల వివాదం కొత్త మలుపు తీసుకుని హాట్ టాపిక్‌గా మారింది.
పట్టణంలోని పురాతన గడి బురుజులకు చెందిన స్థలం సుమారు ఆరెకరాలు ఉంటుంది. స్థలం పరిసరాల్లో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. గతంలో బురుజు స్థలం పురావస్తు శాఖ ఆధీనంలో ఉండేది. ఆ స్థలం క్రయవిక్రయాలకు ఆస్కారమే లేదు. కానీ.. ఏడాదిన్నర క్రితం ఆ స్థలంలో ఉన్న కట్టడాలు, వాటి పరిధిలోని సుమారు 15ఫీట్ల స్థలం మాత్రమే తమ పరిధిలో ఉందని, మిగిలిన సుమారు ఆరెకరాల స్థలం గతంలో ఉన్నవారికే చెందుతుందని పురావస్తు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎనిమిది నెలల క్రితం ఆ స్థలానికి మున్సిపల్ అధికారులు వీఎల్‌టీ ( వేకెంట్ ల్యాండ్ టాక్స్ ) వేశారు. ఈ వీఎల్‌టీ, పురావస్తు శాఖ ఉత్తర్వులతో గడి స్థలాల విక్రయానికి అవకాశం దక్కినట్లు ప్రచారం జరిగింది. అధికార, ప్రతిపక్షానికి చెందిన తృతీయ శ్రేణి నాయకులు కొంతమంది ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు ప్రచారంలో ఉంది.
ఇదీ.. వివాదం


