పుష్కరాలకు పక్కా ప్రణాళిక రూపొందించాలి | - | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు పక్కా ప్రణాళిక రూపొందించాలి

Nov 11 2026 12:25 AM | Updated on Nov 11 2026 12:25 AM

ఘాట్లు, భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణపై దృష్టి సారించాలి అధికారులకు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ దిశానిర్దేశం

జగిత్యాల: గోదావరి పుష్కరాలకు ఆర్నెళ్ల సమయం మాత్రమే ఉన్నందున ప్రతి శాఖ తమ పరిధిలో చేపట్టాల్సిన పనులపై ముందస్తు కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి పుష్కర ఏర్పాట్లపై మంగళవారం సమీక్షించారు. పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో లోటుపాట్లు లేకుండా పూర్తిస్థాయి ప్రణాళిక, కచ్చితమైన అంచనాలు సిద్ధం చేయాలన్నారు. వివిధ శాఖల పనులు, ఎస్టిమేషన్లు మూడు రోజుల్లోగా నిర్ణీత నమూనాలో సమర్పించాలని సూచించారు. నిధుల కోసం ప్రభుత్వానికి పంపించే ప్రతిపాదనలు అంచనాలు కరెక్ట్‌గా ఉండాలన్నారు. స్నానఘాట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానపు గదులు, దుస్తులు మార్చుకునే గదులు, మంచినీటి ట్యాప్‌లు, పారిశుధ్య సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు. పార్కింగ్‌, బస్సుల రాకపోకలు, భక్తుల నడకమార్గాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

1331.84 హెక్టార్లలో 20 సెక్టార్లుగా ప్రణాళిక

ఈవై కన్సల్టెన్సీ ఏజెన్సీ రూపొందించిన లేఅవుట్‌ ప్రకారం ధర్మపురిలో మొత్తం 1331.84 హెక్టార్లలో 20 సెక్టార్లుగా ప్రతిపాదించారు. ఇందులో 9 కార్యాచరణ జోన్లు 20 సెక్టార్లుగా విభజించి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఘాట్లు, మాస్టల్‌ కంట్రోల్‌రూమ్‌, భక్తులు, ఆలయం, వీఐపీ, వీవీఐపీ ఏర్పాట్లు, ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 161 హెక్టార్లలో పార్కింగ్‌, 33 హెక్టార్లలో టెంట్‌సిటి, 10 హెక్టార్లలో హోల్డింగ్‌ ప్రాంతాలు, 4 హెక్టార్లలో సాంస్కృతిక కార్యక్రమాల ప్రాంగణాలు, 2.5 హెక్టార్లలో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ పుష్కరాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశ ఉన్నందున బందోబస్తు భారీగా ఉంటుందన్నారు. వాహనాల రాకపోకలు, ట్రాఫిక్‌ మళ్లింపు, పార్కింగ్‌ ప్రాంతాల నిర్వహణకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. భక్తుల రద్దీని నిరంతరం పర్యవేక్షించేందుకు అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, కీలక కూడళ్లు, ఘాట్లు, ఆలయ పరిసరాల్లో పోలీసు సిబ్బందిని నియమిస్తామన్నారు. అదనపు కలెక్టర్‌ ప్రసూనాంబ, ఈవై కన్సెల్టెన్సీ ఏజెన్సీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement