● సెర్ప్ అడిషనల్ ప్రాజెక్ట్ అధికారి సునీత
జగిత్యాల: గ్రామీణ మహిళలు నైపుణ్యాలు పెంచుకుని ఆర్థికంగా ఎదగాలని సెర్ప్ అడిషనల్ ప్రాజెక్ట్ అధికారి సునీత అన్నారు. జిల్లాకేంద్రంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో బ్యాగుల తయారీ కార్యక్రమం చేపట్టారు. మహిళాసంఘాల్లో ఉన్న వారికి 63రకాల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 11 రకాల శిక్షణ ఇచ్చామన్నారు. జ్యూట్ బ్యాగుల తయారీలో ప్లాస్టిక్ వాడొద్దని హితవు పలికారు. అధికారులు రమేశ్, బాబు, శ్రీధర్, గంగాధర్ పాల్గొన్నారు.
చందనోత్సవానికి రండి..
● కేంద్రమంత్రికి కిషన్‌రెడ్డికి ఆహ్వానం
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 15 నుంచి 20 వరకు నిర్వహించే చందనోత్సవానికి రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆలయ అధికారులు ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుకు కూడా పత్రిక అందించారు. ఈవో అంజనారెడ్డి, ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, వేదపండితులు పెద్దన్న శర్మ పాల్గొన్నారు.
బుక్కెడు బువ్వ పెట్టేలా చూడండి సారూ..!
జగిత్యాల: ‘సారూ.. నాది పెగడపల్లి మండలం నంచర్ల. పేరు రాజమల్లయ్య. 85 ఏళ్లు ఉంటాయి. వ్యవసాయం చేసుకుని జీవించే నేను.. బతుకుదెరువు కోసం బీర్‌పూర్ మండలం డొంకేశ్వరంలో నివసిస్తున్నాను. నాకు నలుగురు కుమార్తెలు. అందరికీ పెళ్లి చేశా. అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు వృద్ధాప్యం పైబడడంతో ఏ పని చేసుకోలేకపోతున్న. నాకు భూమి, జాగా ఏమీ లేదు. కూతుళ్లు పట్టించుకోవడం లేదు. మీరే ఆదుకోవాలి..’ అంటూ ఆర్డీవో మధుసూదన్‌కు ఫిర్యాదు చేశాడో వృద్ధుడు. బుక్కెడు బువ్వ పెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ విషయమై ఆర్డీవోను వివరణ కోరగా.. ఆయన కూతుళ్లను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయం చేసేలా చూస్తామని పేర్కొన్నారు.
పెట్రోల్ బంక్ స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చండి
జగిత్యాలటౌన్: మున్సిపల్ పార్క్, ఫైర్‌స్టేషన్ పక్కనున్న పెట్రోల్ పంపు స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చాలని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు అదనపు కలెక్టర్‌కు మంగళవారం వినతిపత్రం అందించారు. సర్వే నంబర్ 138లోని ఆ స్థలాన్ని 22(ఏ)కింద చేర్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆ స్థలానికి ఎలాంటి యాజమాన్య హక్కులు లేకపోయినా.. నాలుగు గుంటల స్థలాన్ని వినియోగిస్తూ.. 16గుంటల స్థలాన్ని ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని, మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
నేటి నుంచి జిల్లాస్థాయి యువజనోత్సవాలు
జగిత్యాలటౌన్: జిల్లాస్థాయి యువజనోత్సవా లను బుధవారం నుంచి నిర్వహించనున్నట్లు యువజన, క్రీడల అధికారి రవికుమార్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని స్వామి వివేకానంద మినీస్టేడియంలో నిర్వహించే ఉత్సవాల్లో వ్యక్తిగత, సామూహిక ప్రదర్శనలు ఉంటా యని, ఎంపికైన కళాకారులను రాష్ట్రస్థాయికి పంపిస్తామన్నారు. 15నుంచి 29ఏళ్లలోపు అర్హులని, సామూహిక ప్రదర్శనలో జానపద నృత్యం, జానపద గేయాలు, వీధి నాటకం, వ్యక్తిగత విభాగంలో పెయింటింగ్, కవిత్వం వంటి అంశాలు ఉంటాయని తెలిపారు. వివరాలకు జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా కోరారు.


