మెట్‌పల్లి: మెట్‌పల్లి మున్సిపల్ సమావేశాన్ని అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, స్వతంత్ర కౌన్సిలర్లు మూకుమ్మడిగా బహిష్కరించారు. చైర్మన్ మైలారపు లింబాద్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ.. నిరసనకు దిగారు. గురువారం ఉదయం 11గంటలకు మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. చైర్మన్, వైస్‌చైర్మన్ ఓంకారి నవీన్, కౌన్సిలర్లు మొత్తం 26మంది, ఇద్దరు కో–ఆప్షన్ సభ్యులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ కౌన్సిలర్లు గుడికందుల అజయ్, నునుగొండ నరేశ్ మినహా మిగతా కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. అనంతరం మున్సిపల్ ప్రధాన ద్వారం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అజెండాను రూపొందించే విషయంలో కౌన్సిలర్లతో చర్చించకుండా చైర్మన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లకు పాలనలో ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో వార్డుల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. జనరల్ ఫండ్ నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించవద్దని చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. దీనివల్ల భవిష్యత్తులో కార్మికుల వేతనాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశముంటుందన్నారు. చైర్మన్ తన వైఖరిని మార్చుకుని ఎజెండా రూపకల్పనలో కౌన్సిలర్లకు భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కౌన్సిలర్ల బహిష్కరణతో సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేసినట్లు కమిషనర్ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న కౌన్సిలర్లు
మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన
శుక్రవారానికి వాయిదా వేసిన అధికారులు


