ఆగుతున్నాయి.. కాలుతున్నాయి | - | Sakshi
Sakshi News home page

ఆగుతున్నాయి.. కాలుతున్నాయి

Oct 30 2026 12:33 AM | Updated on Oct 30 2026 12:33 AM

● గుబులు పుట్టిస్తున్న ఎలక్ట్రిక్‌ బస్సులు ● మొరాయింపులు.. అగ్నిప్రమాదాలతో భద్రతపై ప్రశ్నలు

● గుబులు పుట్టిస్తున్న ఎలక్ట్రిక్‌ బస్సులు ● మొరాయింపులు.. అగ్నిప్రమాదాలతో భద్రతపై ప్రశ్నలు

కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌ రీజియన్‌లో ఎలక్ట్రిక్‌ బస్సుల వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. బ్యాటరీ విభాగం నుంచి పొగలు రావడం, మంటలు చెలరేగడం, ప్రయాణంలో బస్సులు నిలిచిపోవడం వంటి ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. గురువారం హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సు మొరాయించడంతో మరోసారి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

వరుస ఘటనలు

గతేడాది జూన్‌ 28న కరీంనగర్‌–2 డిపోలో బస్సును స్టార్ట్‌చేసే క్రమంలో బ్యాటరీ విభాగం నుంచి పొగలు, మంటలు వచ్చాయి. ప్రయాణికులు ఎక్కకముందే ఘటన చోటుచేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈఏడాది జూన్‌ 21న కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఎలక్ట్రిక్‌ బస్సులో అలుగునూరు సమీపంలోని కాకతీయ కాలువ వద్ద మంటలు చెలరేగాయి. డ్రైవర్‌ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించడంతో ప్రాణనష్టం తప్పింది. జూలై 1న కరీంనగర్‌–2 డిపోలో మరో ఎలక్ట్రిక్‌ బస్సు బ్యాటరీ నుంచి పొగలు రావడంతో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సెప్టెంబర్‌ 18న అదే డిపోలో బస్సును స్టార్ట్‌ చేసిన అనంతరం పొగలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇలా కొద్ది నెలల వ్యవధిలోనే చోటుచేసుకున్న ఘటనలు ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి.

మార్గమధ్యలోనే మొరాయింపు

బస్సులు తరచూ మొరాయించడం మరో సమస్యగా మారుతోంది. మార్గమధ్యలో బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేందుకు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌ వంటి దూరప్రాంతాలకు వెళ్లే వారు బస్సు ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. గురువారం జరిగిన ఘటన ఈ సమస్యను మరోసారి తెరపైకి తెచ్చింది.

సాంకేతిక లోపాలపై విచారణ ఏదీ

ఎలక్ట్రిక్‌ బస్సుల్లో బ్యాటరీలు, వైరింగ్‌, ఛార్జింగ్‌ వ్యవస్థ, ఇతర సాంకేతిక భాగాల పనితీరు కీలకం. వీటిలో ఏదైనా లోపం తలెత్తితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశముంది. ప్రతి ఘటనకు కారణం సాంకేతిక పరిశీలనతోనే నిర్ధారించాలి. వరుస ఘటనల నేపథ్యంలో బస్సుల బ్యాటరీ వ్యవస్థలు, వైరింగ్‌, నిర్వహణ ప్రమాణాలపై సమగ్ర తనిఖీలు చేపట్టాల్సిన అవసరముంది. బస్సులను రోడ్డెక్కించే ముందు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పరిశీలించడంతో పాటు, లోపాలు గుర్తించి, పూర్తిస్థాయిలో మరమ్మతు చేసిన తర్వాతే సేవల్లోకి తీసుకురావాలి.

ప్రయాణికుల భద్రతే ముఖ్యం

ప్రజా రవాణాలో ఎలక్ట్రిక్‌ బస్సులు కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ, ప్రయాణికుల ప్రాణభద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. వరుసగా చోటుచేసుకుంటు న్న అగ్నిప్రమాదాలు, మొరాయింపులపై ఆర్టీసీ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ఘటనలకు కారణాలను వెల్లడించాల్సిన అవసరముంది. సమస్యలు పునరావృత్తం కాకుండా పరిష్కా ర చర్యలు చేపట్టాలి. లేదంటే ఎలక్ట్రిక్‌ బస్సులపై ప్రయాణికుల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement