– చాకచక్యంగా రక్షించిన ఫైర్ సిబ్బంది
కరీంనగర్ క్రైం: కరీంనగర్‌లోని గణేశ్‌నగర్– హనుమాన్‌నగర్ పరిధిలో డోర్ సెల్ఫ్ లాక్ కావడంతో గదిలో చిక్కుకున్న 18 నెలల చిన్నారిని అగ్నిమాపకశాఖ సిబ్బంది చాకచక్యంగా రక్షించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి తలుపును తెరిచి చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కె.నరేష్ కుమార్, ఎల్‌ఎఫ్‌ఎఫ్ యాదగిరి, ఫైర్ ఫైటర్ టెక్నికల్ పి.శ్రీనివాస్, ఫైర్ ఫైటర్లు ఎం.రాజ్‌కుమార్, సీహెచ్.కిషోర్, కె.ప్రసాద్ పాల్గొన్నారు.
జీడీకే–11గనిపై కార్మికుడి ఆత్మహత్యాయత్నం
గోదావరిఖని: కాలికి గాయం ఉన్నా అండర్‌గ్రౌండ్‌లో విధులు నిర్వహించాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొంటూ గురువారం జీడీకే–11గనిపై సింగరేణి కార్మికుడు బుచ్చిబాబు ఒంటిపై పెట్రోల్‌పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గనిలో జనరల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బుచ్చిబాబు 2019 నుంచి సంస్థలో విధులు నిర్వహిస్తున్నాడు. రోడ్డుప్రమాదంలో కాలుకు గాయాలు కావడంతో సర్ఫేస్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం నుంచి అండర్‌గ్రౌండ్‌లో డ్యూటీకి వెళ్లాలని సూచించడంలో సాయంత్రం మేనేజర్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అక్కడ ఉన్నవారు అడ్డుకోవడంతో పాటు మంటలను ఆర్పివేశారు. ఈఘటనలో బుచ్చిబాబు కాళ్ల ప్రాంతంలో సుమారు 6 శాతం గాయాలయ్యాయి. గోదావరిఖని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, రెండేళ్ల నుంచి వ్యక్తిగత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సర్ఫేస్‌లో విధులు నిర్వహించేందుకు యాజమాన్యం అవకాశం కల్పించిందని, గుర్తింపు కార్మిక సంఘం అభ్యర్థన మేరకు శుక్రవారం నుంచి అదనంగా సర్ఫేస్ విధులు నిర్వహించేందుకు వెసులుబాటు కల్పించిందని అధికారులు తెలిపారు. ఈఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం ప్రకటించింది.
బిహార్ యువకుడిపై కత్తితో దాడి
మెట్‌పల్లి: పట్టణంలో బిహార్ యువకుడిపై అదే రాష్ట్రానికి చెందిన కొందరు కత్తితో దాడి చేసిన సంఘటన కలకలం సృష్టించింది. ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. బీహార్‌కు చెందిన హిట్లర్‌కుమార్ (20) మూడు నెలల క్రితం కూలీ పని కోసం మెట్‌పల్లికి వచ్చాడు. దసరా రోజు కూలీ పనులు చేస్తున్న అదే రాష్ట్రానికి చెందిన రాహుల్, బబ్లూ, సందీప్, పునీత్, మనోజ్ చౌదరితో హిట్లర్‌కుమార్‌కు గొడవ జరిగింది. అప్పటినుంచి ఐదుగురు అతడిపై పగ పెంచుకున్నారు. బుధవారం రాత్రి బస్టాండ్ వద్ద హిట్లర్ ఉండగా.. ఐదుగురు వచ్చి అతడిపై కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
ప్రైవేటు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
కరీంనగర్ క్రైం: నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీధర్ అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. శ్రీధర్ మరో పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి స్నాప్‌చాట్ ద్వారా అసభ్య సందేశాలు పంపిస్తూ, ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. బాధిత విద్యార్థిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.


