కరీంనగర్ క్రైం: తిరుమలలో కరీంనగర్ భగత్‌నగర్‌కు చెందిన సిరిగినేని కొండలరావు(55)గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం గదికి చేరుకుని, కుటుంబ సభ్యులతో అరుణాచలానికి బయల్దేరేందుకు సిద్ధమవుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
గుర్తుతెలియని మృతదేహం
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ పరిధిలోని అలుగునూరు బ్రిడ్జి కింద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు పరిశీలించారు. మృతుడు గ్రీన్ కలర్ టీషర్ట్, ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు. వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో భద్రపరిచారు. ఎవరైనా గుర్తిస్తే కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సీఐ రాంచందర్‌రావు కోరారు.
క్యూఆర్ కోడ్‌తో భిక్షాటన
రామగుండం: ఓ అంధ భిక్షాటకుడు తన బ్యాంక్ అకౌంట్ నంబర్‌తో కూడిన క్యూఆర్ కోడ్‌ను మెడలో వేసుకొని రైలులో భిక్షాటన చేయడాన్ని ప్రయాణికులు ఆసక్తిగా చూశారు. చేతి కర్రసాయంతో ఓ అంధ భిక్షాటకుడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట రైల్వేస్టేషన్‌లో రైలెక్కి బోగీలో మెల్లమెల్లగా భిక్షాటన చేస్తూ ముందుకెళ్లాడు. కాగా, తన మెడలో ఉన్న క్యూఆర్ కోడ్‌కు ఎంతమంది ధర్మం చేస్తున్నారో కూడా తెలియని ఆ అమాయక అంధుడి బ్యాంకు ఖాతాలో రోజూ ఎంత జమవుతుందో, ఎవరు డ్రా చేస్తారో కానీ, కంటి చూపు లేకుండా రైళ్లలో భిక్షాటన చేస్తుండడం ప్రయాణికుల మనసును కదిలించింది.
విద్యుత్ మోటార్ల దొంగల అరెస్టు
కరీంనగర్ రూరల్: విద్యుత్ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్‌వైర్ల దొంగతనానికి పాల్పడిన ఇద్దరిని గురువారం అరెస్టు చేసినట్లు కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్‌కు చెందిన ఆటోడ్రైవర్లు వివర్ సాయికుమార్(28), వజీద్ పాషా(24) కొత్తపల్లి మండలం బద్దిపల్లిలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటూ రాత్రివేళల్లో ఆటోలో తిరుగుతూ వ్యవసాయబావుల వద్ద ఉన్న విద్యుత్ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లను పగులకొట్టి కాపర్‌వైర్లను దొంగతనం చేశారని వివరించారు. కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో వరుసగా దొంగతనాలు జరగడంతో ప్రత్యేక నిఘా పెట్టి గురువారం ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి, మానకొండూరు పోలీస్‌స్టేషన్లలో ఇద్దరిపై 8 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. మూడు విద్యుత్ మోటార్లు, ఆటోను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.


