ముందస్తు ఫీజు దోపిడీ | - | Sakshi
Sakshi News home page

ముందస్తు ఫీజు దోపిడీ

Oct 29 2026 12:12 AM | Updated on Oct 29 2026 12:12 AM

● తల్లిదండ్రులపై ఆర్థిక భారం ● స్పందించని విద్యాశాఖ అధికారులు

జిల్లాలోని ఓ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థికి పదో తరగతి ఫీజు రూ.1500 తేవాలని చెప్పడంతో ఇదే విషయాన్ని అతడు తల్లిదండ్రులకు చెప్పాడు. పరీక్ష ఫీజు అంత ఉండదని, ఎందుకంత వసూలు చేస్తున్నారని పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. ఇది ఒక్క ఆ పాఠశాలలోనే కాదు.. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కొనసాగుతున్న తతంగం.

జగిత్యాల: పదో తరగతి పరీక్షల ఫీజుల విషయంలో కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో వసూళ్లు చేస్తున్నారనే ఆరోపనలు వినిపిస్తున్నాయి. పదో తరగతికి సంబంధించి ఫీజు గడువు నవంబర్‌లో వచ్చే అవకాశం ఉంది. అయితే ముందస్తుగానే పరీక్ష ఫీజు అంటూ వసూళ్లు చేస్తున్నట్లు తెల్సింది. వాస్తవానికి పదో తరగతి పరీక్ష ఫీజు రూ.125 మాత్రమే. దీనిని ఆసరాగా చేసుకున్న కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ముందస్తుగానే ఫీజు పేరిట ఒక్కో విద్యార్థి నుంచి రూ.1500 నుంచి రూ.2వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇది తమలాంటి మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● అదనపు భారంపై ఆందోళన

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు నిర్ణీత పరీక్ష ఫీజుతోపాటు, ఇతరత్రా కోసం వసూలు చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రం చార్జీలకు సంబంధించిన వివరాలు స్పష్టంగా చెప్పడం లేదనే ఆరోపణలున్నాయి. వసూలు చేస్తున్నా వాటికి రశీదులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఒక్కో విద్యార్థి రూ.1500 నుంచి రూ.2 వేలు చెల్లించాలంటే ఇబ్బంది పడాల్సి వస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. వాస్తవంగా ప్రైవేటు స్కూళ్లలో చదివించడం అంటే విద్యను కొనుక్కోవాల్సిందే. ఫీజులే తడిసి మోపెడవుతున్నాయి. ఎల్‌కేజీకే రూ.30నుంచి రూ.40 వేల వరకు ఉండగా.. పదో తరగతి విద్యార్థులకు సుమారు రూ.75వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే పాఠశాలల ఫీజులకు సంబంధించిన ఫీజుల ఆడిట్‌ నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినా ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాలలో ఫీజుల డిస్‌ప్లే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా మచ్చుకు కన్పించదు. ఏ అకేషన్‌ వచ్చినా ఫీజుల పేరిట వసూళ్లు చేస్తున్నారు.

● స్పందించని విద్యాశాఖ

ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరీక్ష ఫీజు ఎంత చెల్లించాలో తెలపాల్సిన అవసరముంది. అదే సమయంలో ప్రైవేటు యాజమాన్యాల ముందస్తు వసూళ్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుని తల్లిదండ్రులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. పలు స్కూళ్లలో కనీస నిబంధనలు పాటించడం లేదు. కొన్ని ఎలాంటి ప్లేగ్రౌండ్‌లేకపోవడం, సిటీ మధ్యలోనే స్కూళ్లను ఏర్పాటు చేయడం, చీకటి గదుల్లోనే తరగతుల నిర్వహణ ఉన్నప్పటికీ విద్యాశాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement