విద్యావిధానం | - | Sakshi
Sakshi News home page

విద్యావిధానం

Oct 29 2026 12:12 AM | Updated on Oct 29 2026 12:12 AM

నైపుణ్య ఆధారిత విద్యకు ప్రాధాన్యం పశ్చిమాస్ట్రేలియాలో పర్యటించా

ఆస్ట్రేలియా కరిక్యులంతో స్కూల్‌ ప్రారంభిస్తా

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం

సంప్రదాయ కోర్సులకు భిన్నంగా నైపుణ్యాలకు పెద్దపీట

ఆస్ట్రేలియా ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం

12వ తరగతి వరకు నిరంతర అభ్యసనంతో ఒత్తిడిలేని విద్య

అల్ఫోర్స్‌ విద్యా సంస్థల అధినేత వుట్కూరి నరేందర్‌రెడ్డి

కరీంనగర్‌లో ఆస్ట్రేలియా

‘సంప్రదాయ కోర్సులతో తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను విద్యార్థులపై రుద్దుతున్నారు. ఇది విద్యార్థులపై ఒత్తిడి కలగజేస్తుంది. వారి ఆసక్తిని గమనించి సంప్రదాయ మెడిసిన్‌, ఇంజినీరింగ్‌కు బదులుగా అన్ని రకాల ఆర్ట్స్‌, మ్యూజిక్‌, సైన్స్‌, కామర్స్‌ కోర్సులకు పెద్దపీట వేయాలి. అందుకే

అన్ని విభాగాల్లోనూ విద్యార్థులు రాణించేలా ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. అక్కడి కరిక్యులంతో విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలను ప్రోత్సహించి వారిని వివిధ రంగాల్లో సమర్థులుగా తీర్చిదిద్దేందుకు కరీంనగర్‌ వేదికగా ఇంటర్నేషనల్‌ స్థాయి విద్యను అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం’ అని అల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ వుట్కూరి నరేందర్‌రెడ్డి

పేర్కొన్నారు. బుధవారం ‘సాక్షి’తో పలు అంశాలు వెల్లడించారు. – సాక్షిప్రతినిధి, కరీంనగర్‌

నైపుణ్య ఆధారిత విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎందుకు భావిస్తున్నానంటే.. ప్రతి విద్యార్థి ఒకే రంగంలో రాణించలేడు. కొందరికి సాంకేతిక రంగంపై ఆసక్తి ఉంటే, మరికొందరు వ్యాపార నిర్వహణ, వ్యవసాయం, కళలు, సంగీతం, క్రీడలు వంటి రంగాల్లో ప్రతిభ చూపుతారు. అందుకే ఒకేషనల్‌, టెక్నికల్‌, స్కిల్‌ బేస్డ్‌ కోర్సులకు మరింత ప్రాధాన్యమివ్వాలి. పాఠశాలస్థాయిలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థుల అభ్యసనాన్ని క్రమబద్ధంగా కొనసాగించే విధానం ఉంటే వారికి విద్యాపరంగా నిరంతర పురోగతి సాధ్యమవుతుంది. తరచూ పరీక్షల ఒత్తిడికి గురిచేయకుండా, వారి ప్రతిభను గుర్తించవచ్చు. చిన్న వయస్సు నుంచే విద్యార్థుల్లో ఆసక్తులు, ప్రతిభ వేర్వేరుగా ఉంటాయి. సబ్జెక్టుల ఎంపిక విద్యార్థుల వయసు, అభిరుచి, విద్యా పునాదులు, భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి.

ఇటీవల పశ్చిమ ఆస్ట్రేలియాలో పర్యటించాను. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 12 మంది విద్యారంగ ప్రముఖులతో కలిసి అక్కడి విశ్వవిద్యాలయాలు, పాఠశాలలను సందర్శించాం. వారి విద్యా విధానం, పాఠ్యప్రణాళిక, బోధనా పద్దతులు, విద్యార్థులకు అందుతున్న ఉపాధి అవకాశాలను పరిశీలించాం. ప్రధానంగా అకడమిక్‌ సబ్జెక్టులతో పాటు బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఎకనామిక్స్‌, అగ్రికల్చర్‌ సైన్స్‌, వెటర్నరీ, ఆర్ట్స్‌, మ్యూజిక్‌, స్పోర్ట్స్‌ వంటి రంగాల్లోనూ విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నారు. విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా భవిష్యత్తు మార్గాన్ని ఎంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు.

తల్లిదండ్రుల ఆసక్తి, మారుతున్న విద్యా అవసరాలను దృష్టిలో పెట్టుకుని వెస్ట్‌ ఆస్ట్రేలియా కరిక్యులంతో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించాం. అనుమతులు రాగానే వచ్చే విద్యా సంవత్సరంలో నర్సరీ నుంచి రెండో తరగతి వరకు ప్రారంభిస్తాం. ఇక ఐఐటీ, మెడిసిన్‌తో పాటు ఇతర కెరీర్‌ అవకాశాలను గురించి చెప్పాలంటే.. ఐఐటీ, వైద్య విద్యతో పాటు క్లాట్‌, చార్టర్డ్‌ అకౌంటెన్సీ, వ్యవసాయం, వెటర్నరీ, క్రీడలు, సాంకేతిక విద్య, వ్యాపార నిర్వహణ వంటి అనేక రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. పిల్లల ఆసక్తిని గుర్తించి సరైన సమాచారం, మార్గదర్శకత్వం అందిస్తే వారికి అనువైన రంగంలో మంచి భవిష్యత్‌ను నిర్మించుకోగలరు. విద్య అనేది కేవలం సర్టిఫికెట్లు, మార్కులు సంపాదించడానికి మాత్రమే కాదు. మంచి వ్యక్తిత్వం, ఆలోచనా సామర్థ్యం, నైపుణ్యాలు, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడానికి ఉపయోగపడాలి. తల్లిదండ్రులు సైతం తమ ఆశయాలను పిల్లలపై రుద్దకుండా, వారి ప్రతిభను ప్రోత్సహించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement