కథలాపూర్(వేములవాడ): ఎల్‌నినో ప్రభావం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయినా.. అష్టకష్టాలు పడి బావులు, బోరుబావులపై ఆధారపడి రైతులు వరి పంట సాగు చేశారు. కొన్ని గ్రామాల్లో పంటలకు సరిగా నీళ్లందకపోవడంతో పూర్తిస్థాయిలో ఎదగలేదు. దీంతో ఈ సీజన్‌లో వరి దిగుబడులు తగ్గే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో కొనుగోళ్లలో ఆన్‌లైన్ ట్రక్‌షీట్ విధానాన్ని అమలు చేస్తే తరుగు దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని రైతులు, రైతు ఐక్యవేదిక నాయకులు అభిప్రాయపడుతున్నారు. తరుగు దందా గురించి అధికారులకు తెలిసినా.. మిల్లర్ల ఒత్తిడికి తలొగ్గి పారదర్శకత లేని మాన్యువల్ ట్రక్‌షీట్ విధానానికే మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే వానాకాలం సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం సేకరణకు సివిల్ సప్లయ్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈనెల చివరి వారంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ సీజన్‌లో ఆన్‌లైన్ ట్రక్‌షీట్ విధానాన్ని అమలు చేసి తరుగు పేరిట దోపిడీని అరికట్టాలని రైతులు కోరుతున్నారు.
438 కొనుగోలు కేంద్రాలు..
జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించి వరి 2.93లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. పంట చేతికొచ్చే దశలో ఉంది. వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లాలో 438 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో 297, సెర్ప్ ఆధ్వర్యంలో 140, మెప్మా ఆధ్వర్యంలో ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సన్న రకం వరి ధాన్యం కొనుగోలుకు 127 కేంద్రాలు కేటాయించారు. వరి ధాన్యం ఏ గ్రేడ్‌కు రూ.2,461, సాధారణ రకానికి రూ.2,441 చొప్పున చెల్లిస్తారు. సన్న రకానికి బోనస్ రూ.500 చెల్లిస్తామని అధికారులు తెలిపారు.
కొన్ని రోజులకే పరిమితం..
మిల్లర్ల తరుగు, అవుటర్న్ పేరిట దోపిడీకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం గత యాసంగి సీజన్‌లో ఆన్‌లైన్ ట్రక్‌షీట్ విధానానికి శ్రీకారం చుట్టింది. తూకం వేసే సమయంలో కొనుగోలు కేంద్రంలోనే రైతు సమక్షంలోనే ఆన్‌లైన్ ట్రక్‌షీట్ జనరేట్ కావడంతో.. మిల్లర్లు ధాన్యంలో కోత పెట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. దీనిపై అప్పట్లో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ విధానం కొన్ని రోజులకే పరిమితం చేశారు. తర్వాత ఎత్తేసి మళ్లీ మాన్యువల్ ట్రక్‌షీట్ విధానం అమలు చేశారు. నాణ్యత పేరుతో మిల్లర్లు తరుగు దోపిడీ చేసేందుకు పాత విధానం అవకాశం ఇచ్చింది. ప్రతీ లారీలో క్వింటాళ్ల కొద్దీ కోత పెట్టడంతో నష్టపోయామని రైతులు వాపోయారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు చొరవ చూపి వరి కొనుగోలు కేంద్రాల్లో ఈ సీజన్‌లో ఆన్‌లైన్ ట్రక్‌షీట్ విధానం అమలు చేసి తరుగు దోపిడీకి అడ్డుకట్ట వేయాలని జిల్లాలోని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆన్‌లైన్ ట్రక్‌షీట్ విధానం అమలు చేయాలంటున్న అన్నదాతలు
జిల్లాలో 438 వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు


