జగిత్యాలక్రైం: శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యమని, పటిష్టమైన శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. విధి నిర్వహణలో, దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సొసైటీలో శాంతియుతంగా, ప్రశాంతంగా జీవిస్తున్నామంటే దానికి సైనికులు, పోలీసులే కారణమన్నారు. అక్టోబర్ 21 నుంచి 31 వరకు ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటే అభివృద్ధి ప్రతీ ఒక్కరికి చేరుతుందనడానికి మన రాష్ట్రమే నిదర్శనమన్నారు. జిల్లాలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్లలో పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అడిషనల్ ఎస్పీ చేతన్‌నితిన్, డీఎస్పీలు పురుషోత్తంరెడ్డి, రాములు, రవికూమార్, పోలీసు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పటిష్టమైన శాంతిభద్రతలతోనే అభివృద్ధి
కలెక్టర్ సత్యప్రసాద్


