మల్యాల: ముత్యంపేటలోని శ్రీకొండగట్టు ఆంజనేయస్వామిని రాష్ట్ర హైకోర్టు జడ్జి పుల్లా కార్తీక్ దర్శించుకున్నారు. దసరా పండుగను పురస్కరించుకొని కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఏఈవో హరిహరనాథ్, సూపరింటెండెంట్ సునీల్‌కుమార్, ప్రధాన అర్చకులు జితేంద్రస్వామి, చిరంజీవస్వామి, మారుతిప్రసాద్, స్థానాచార్యులు కపీందర్, ఆలయ పరిశీలకులు అశోక్ పాల్గొన్నారు.
అక్రమ మైనింగ్ అరికట్టండి
● సీఎంకు మాజీ మంత్రి జీవన్‌రెడ్డి లేఖ
జగిత్యాలటౌన్: చెరువులు, కుంటలు, గుట్టల మట్టిని అక్రమంగా తరలిస్తూ పర్యావరణ విఘాతానికి కారణమవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కోరారు. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్, తిమ్మాపూర్‌తోపాటు జిల్లాలో పలు గుట్టల నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తుండటంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. మైనింగ్‌తో ఏర్పడిన భారీ గుంతల్లో చిన్నారులు పడి చనిపోతున్నారని అన్నారు. అక్రమ మైనింగ్ మాఫియాపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
అశ్వరథంపై వెంకన్న
కోరుట్లటౌన్: కోరుట్ల పురాతన వేంకటేశ్వరస్వామి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు కనుల పండువగా జరిగాయి. మంగళవారం వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి అశ్వరథంపై వెంకన్నస్వామి పల్లకి సేవ జంబి గద్దె వద్దకు మేళతాళాల మధ్య చేరింది. జంబి వృక్షానికి ప్రధానార్చకులు బీర్నంది నరసింహాచారి వైదిక నిర్వహణంలో ప్రత్యేక పూజలు చేశారు. వేంకటేశ్వరస్వామి ఆలయానికి అశ్వరథంపై వెంకన్నస్వామి పల్లకి సేవ చేరింది. భక్తులు కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌కుమార్, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మాజీ చైర్మన్ జువ్వాడి కృష్ణారావు, కోరుట్ల మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంతగంగాధర్, ఎలుగూరి శ్వేతకిరణ్, ఆలయ చైర్మన్ ఎతిరాజం నర్సయ్య, ఆలయ అధికారులు ఈవో విక్రమ్, నర్సయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


