జగిత్యాలరూరల్: గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులు, తడి, పొడి చెత్త సేకరణకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు.‘స్వచ్ఛత స్వభావం–స్వచ్ఛ భార త్, వికసిత భారత్’ నినాదంతో వచ్చేనెల 2 వరకు స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, పారిశుధ్య సిబ్బందిని భాగస్వామ్యం చేస్తున్నారు. కలెక్టర్, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ చైర్మన్ సత్యప్రసాద్ ఆదేశాల మే రకు గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య డ్రైవ్‌లు కొనసాగుతున్నాయి. చెత్త పేరుకుపోయే ప్రాంతాల ప్ర క్షాళన, పాఠశాలల్లో అవగాహన, మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, చెరువులు, వాగుల వద్ద పారి శుధ్య పనులు చేపడుతున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ, గుట్కా, పాన్ మసాలా ఉమ్మివేయడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
విద్యార్థులతో స్వచ్ఛత సందేశం
ఈ నెల 17, 18 తేదీల్లో పాఠశాల విద్యార్థులు ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను సందర్శించారు. వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. పాత పుస్తకాలు, బొమ్మలను సేకరించారు. 19, 20 తేదీల్లో చెత్త ఎక్కువగా పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించి శ్రమదానం ద్వారా శుభ్రపరిచారు. ఈనెల 25, 26న పాఠశాలలు, పంచాయతీల్లో క్రీడాపోటీల ద్వారా స్వచ్ఛతపై ప్రచారం కల్పించారు. గణేశ్ నిమజ్జనం అనంతరం ఘాట్లను శుభ్రం చేయడంతోపాటు పూల వ్యర్థాలతో కంపోస్ట్ తయారీకి చర్యలు తీసుకోనున్నారు.
కార్మికులకు ప్రత్యేక శిబిరాలు
పారిశుధ్య కార్మికులకు ఈనెల 30న సపాయిమిత్ర సురక్ష– సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు, రక్షణ పరికరాల పంపిణీతోపాటు సన్మానం చేయనున్నారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు.
అక్టోబర్ ఒకటిన శ్రమదానం
ప్రతి గ్రామపంచాయతీల్లో వచ్చేనెల ఒకటిన ఉదయం 8 గంటలకు ఒక రోజు.. ఒక గంట.. కలిసికట్టుగా కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో భారీ శ్రమదానం నిర్వహించనున్నారు. 2న స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు, పట్టణాల్లో కౌన్సిల్ సమావేశాలు నిర్వహించనున్నారు. శుభ్రం చేసిన ప్రాంతాల్లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కింద మొక్కలు నాటనున్నారు.
అధికారుల బాధ్యతలివే..
ప్రతి గ్రామంలో లైన్ డిపార్ట్‌మెంట్‌తో సమన్వయం చేసుకుని రోజువారీ కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ప్రతిరోజూ 10 ఉత్తమ ఫొటోలను గ్రూపులో అప్‌లోడ్ చేయాలని సూచించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు సూచించారు. మిషన్ భగీరథ అధికారులు నీటి లీకేజీలను అరికట్టి, గ్రామాల్లోని ఓహెచ్‌ఎస్‌ఆర్, జీఎల్‌ఎస్‌ఆర్ ట్యాంకులను శుభ్రం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.


