జగిత్యాలక్రైం: వినాయక నవరాత్రులు ముగుస్తున్నాయి. ఇక అందరి దృష్టి నిమజ్జనంపైనే పడింది. అయితే నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకొనేలా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ఇప్పటికే మున్సిపల్, రెవెన్యూ, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా 700 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టనున్నారు. జిల్లాకేంద్రంతోపాటు మెట్‌పల్లి, కోరుట్ల, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలు, మల్యా ల, కొడిమ్యాల మేజర్ గ్రామపంచాయతీల్లో ట్రాఫి క్ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.
భారీ ఏర్పాట్లు
నిమజ్జనం జరిగే ప్రాంతాలకు ఇప్పటికే భారీక్రేన్లతో పాటు తెప్పలను తెప్పించారు. అలాగే గజ ఈతగా ళ్లను అందుబాటులో ఉంచనున్నారు. జగిత్యాలలో చింతకుంట చెరువు, మెట్‌పల్లిలో వట్టివాగు, కోరుట్లలో పెద్దవాగు, ధర్మపురిలో గోదావరి, మైతాపూర్‌లో వాగులో నిమజ్జనం చేయనున్నారు. జిల్లాలో 3,219 వినాయక విగ్రహాలను నెలకొల్పగా.. వాటి ని సుమారు 340 ప్రాంతాల్లో నిమజ్జనం చేయనున్నారు. ఒక అడిషనల్ ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, 17 మంది ట్రా న్స్‌జెండర్లు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు శోభా యాత్ర జరిగే ప్రాంతాల్లో సేవలు అందించనున్నారు.
మూడు రోజులు నిమజ్జనాలు
జిల్లాలో నిమజ్జనం కార్యక్రమం మూడురోజుల పాటు సాగనుంది. 23, 24, 25 తేదీల్లో మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఉత్సవాలు సజావుగా జరిగేలా పోలీసులు ఇప్పటికే ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు, మండపాల నిర్వాహకులతో సమావేశమయ్యారు. మరోవైపు మున్సిపల్ చైర్మన్లు, రెవెన్యూ అధికారులు, కులసంఘాల సభ్యులతో సమావేశాలు ఏర్పాటుచేసి వారికి అవగాహన కల్పించారు.
ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్‌జెండర్లు
జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో 17 మంది ట్రాన్స్‌జెండర్లకు ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కల్పించారు. సమాజంలో వారికి ప్రజలతో సమాన గౌరవం కల్పించాలనే లక్ష్యంతో పోలీసుశాఖ ట్రాఫిక్ నియంత్రణకు వీరిని నియమించి డ్రెస్‌కోడ్ కోసం టీషర్ట్‌లు కూడా అందించారు.


