ఇష్టారీతిలో మెడికల్ షాపుల నిర్వహణ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల విక్రయాలు నామమాత్రంగా డ్రగ్స్ అధికారుల తనిఖీలు
జిల్లాలో 800 వరకు మెడికల్ షాపులు
జగిత్యాల: జిల్లాలో మెడికల్ షాపుల నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వైద్యుల సలహా (ప్రిస్క్రిప్షన్) లేకుండా మెడిసిన్స్ ఇవ్వకూడదని నిబంధన ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోవడం లేదు. కొనుగోలు చేసిన మందులకు కచ్చితంగా రశీదు ఇవ్వాల్సి ఉండగా కొన్నిషాపులు పాటించడం లేదు. జిల్లాలో సుమారు 800కు పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. 100కు పైగా మెడికల్ ఏజెన్సీలు ఉన్నాయి. చలికాలం, వేసవికాలం ఇలా ఏకాలంలోనైనా మెడికల్ షాపుల్లో తప్పనిసరిగా ఏసీలు వాడాలి. అయినప్పటికీ కొన్ని షాపుల్లో కన్పించవు. మందులకు ఉష్ణోగ్రత తగిలి వాటి నాణ్యత కోల్పోతున్నాయి. ఫలితంగా అవి సక్రమంగా పనిచేయవు. తక్కువ ధరకు విక్రయించాల్సిన మందులను ఎక్కువ ధరలకు అమ్ముతూ దోచుకుంటున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణ లేకపోవడంతోనే నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే అపవాదు ఉంది.
నిబంధనలు తూచ్..
నిబంధనల ప్రకారం ప్రతి మెడికల్ షాపులో లైసె న్స్ కలిగిన ఫార్మసిస్ట్ ఉండాలి. చాలా దుకాణాల్లో ఫార్మసిస్ట్‌లే కన్పించరు. మందుల కొనుగోళ్లు ఆధీకృత డీలర్ నుంచి తీసుకోవాలి. అందుకు సంబంధించిన ఇన్వాయిస్.. అమ్మకాలకు సంబంధించిన రశీదులు, ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. ఏ ఒక్క మెడికల్ షాపుల్లోనూ ఇవి అమలు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆర్‌ఎంపీలు, పీఎంపీలు సూచించిన మందులనే విక్రయించాలి. మెడికల్ షాపునకు వచ్చిన ఏ కొనుగోలుదారుకై నా మందులు ఇవ్వరాదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. డ్రగ్ అధికారుల నియంత్రణ లేకపోవడంతో వారి ఇష్టానుసారంగా మెడికల్ షాపుల నిర్వహణ కొనసాగుతోంది.
సెల్లార్లలో షాపులు
మెడికల్ షాపులు నిర్వహించాలంటే తప్పకుండా అనువైన స్థలం ఉండాలి. కొన్ని ఆస్పత్రుల్లో సెల్లార్లలో మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు. కొందరు చుట్టూ గోడలు నిర్మించి రేకులషెడ్లలో ఏర్పాటు చేస్తున్నారు. అలా ఏర్పాటు చేసినప్పుడైనా ఏసీలు తప్పనిసరి. సెల్లార్లు, రేకులషెడ్లలో ఏర్పాటు చేస్తే మందులు చెడిపోయే ప్రమాదం ఉంటుంది.
అడిగిన వారికి మందులు
చిన్నపాటి జ్వరం వచ్చినా.. జలుబు, దగ్గు, తలనొప్పి వంటి నివారణకు కొందరు షాపులకు వెళ్తే మందులు ఇస్తున్నారు. వాస్తవానికి ఇలా ఇవ్వడం నేరం. రోగనిర్ధారణ చేయకుండా మందులు వాడితే సైడ్‌ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మందులను ఫ్రిడ్జ్‌లలో కాకుండా ఇష్టానుసారంగా నిల్వ చేస్తున్నారు.
ఇన్‌చార్జి అధికారే..
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉపేందర్ ఇటీవల బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. నిజామాబాద్‌లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌కు ఇన్‌చార్జి ఇచ్చారు. దీంతో పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వస్తున్నాయి.
నిబంధనలు పాటించకుంటే చర్యలు
మెడికల్ షాపుల నిర్వాహకులు నిబంధనలు పాటించాల్సిందే. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిది మందులు ఇవ్వరాదు. మెడికల్ షాపులు ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. రికార్డుల నమోదు తప్పకుండా చేయాలి.
– శ్రీకాంత్, ఇన్‌చార్జి డ్రగ్ ఇన్‌స్పెక్టర్


