పంచాయతీ ఎన్నికల్లో డిపాజిట్ దక్కించుకున్న వారికి తిరిగిరాని సొమ్ము తొమ్మిది నెలలవుతున్నా స్పందన కరువు అడిగితే ఎన్నికల ఖర్చుల కింద చూపెడుతున్న అధికారులు
జగిత్యాలరూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు నామినేషన్ వేసిన రోజు చెల్లించిన డిపాజిట్ డబ్బులను అధికారులు వాపస్ ఇవ్వడం లేదు. గత డిసెంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యులుగా చాలా మంది నామినేషన్లు సమర్పించగా, పలువురు గెలుపొందారు. మరికొందరు స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. ఇంకొందరు డిపాజిట్లు కోల్పోయారు. గెలుపొందిన వారితో పాటు ఓటమి పాలై డిపాజిట్ దక్కించుకున్న వారిలో కొందరు ఎన్నికల ఖర్చు లెక్కలు సమర్పించకపోవడంతో అధికారులు డిపాజిట్ రుసుం తిరిగి చెల్లించనట్లు తెలుస్తోంది.
జిల్లాలో 8,769 మంది పోటీ
జిల్లాలో ఏకగ్రీవాలు పోనూ మిగతా స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ స్థానాలకు 1,442 మంది పోటీ చేశారు. వార్డు సభ్యుల స్థానాలకు 7,327 పోటీచేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పోటీలో డిపాజిట్ దక్కించుకున్న వారికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికల బరిలో నిలిచి పోలైన ఓట్లలో కనీసం ఆరో వంతు వచ్చినవారికి మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ కోల్పోయిన వారికి మాత్రం ఇవ్వరు. కొందరు పోటీచేసిన వారు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదు. అయితే వచ్చేవి తక్కువ డబ్బులు తక్కువే కదా అని కొందరు.. మరికొందరు డిపాజిట్ సొమ్ముకోసం తిరగడమేంటని వదిలేస్తున్నారు. దీనిపై అధికారులు కూడా లెక్కలు చెప్పని పరిస్థితి నెలకొంది.
ఎన్నికల ఖర్చుకు నిధులు ఇవ్వకపోవడంతో..
జిల్లాలో 2025 డిసెంబర్‌లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఫలితాల తర్వాత డిపాజిట్లు కోల్పోయిన వారిని మినహాయించుకుని మిగిలిన వారందరికీ డిపాజిట్ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఆ డబ్బులు అధికారుల వద్దే ఉంచుకున్నారు. కొందరు అడిగితే మాత్రం ఎన్నికల ఖర్చులో చూపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రతీ మండలానికి ఎన్నికల ఖర్చు కింద రూ.5 లక్షల వరకు ప్రభుత్వం ఇవ్వాలి. కాగా, జిల్లాలో సర్పంచ్ కంటే వార్డు సభ్యులుగా పోటీచేసి డిపాజిట్ దక్కించుకున్న వారికి డిపాజిట్ డబ్బులు ఇచ్చేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు.
జిల్లాలో..
గ్రామ పంచాయతీలు 385
వార్డు స్థానాలు 3,536
సర్పంచ్ అభ్యర్థులు 1,442
వార్డు అభ్యర్థులు 7,327
సర్పంచ్ డిపాజిట్ (జనరల్) రూ.2,000
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.1,000
వార్డు సభ్యులు (జనరల్) రూ.500
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.250


