రైతుబీమాకు మంగళం..!? | - | Sakshi
Sakshi News home page

రైతుబీమాకు మంగళం..!?

Aug 20 2026 3:28 AM | Updated on Aug 20 2026 3:28 AM

● ఈనెల 15నుంచి నిలిచిపోయిన బీమా ● జిల్లాలో 1.35 లక్షల మంది ఎదురుచూపు

జగిత్యాలఅగ్రికల్చర్‌: ఏదైనా సంఘటన జరిగి.. రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఇన్నాళ్లు అండగా నిలిచిన రైతుబీమా పథకం నిలిచిపోయినట్లేనేనా..?! సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పథకాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు ఎల్‌ఐసీ సహకారంతో అమలు చేస్తూ వస్తోంది. పథకానికి సంబంధించిన ప్రీమియంను ఏటా ఆగస్టు 14న ఎల్‌ఐసీకి చెల్లిస్తుంది. అయితే ప్రస్తుత ఏడాదికి సంబంధించి ఎల్‌ఐసీకి ప్రీమియం చెల్లించకపోవడంతో పథకం నిలిచిపోయినట్లేనని ఇటు రైతులు, అటు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రైతుబీమా స్థానంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా తీసుకొస్తారనే ప్రచారం కొనసాగుతున్నా.. ఆ పథకం ఎప్పుడు అతమలవుతుందో.. ఎవ్వరికీ తెలియని పరిస్థితి నెలకొంది.

ఎలా చనిపోయినా.. రూ.5లక్షలు

వ్యవసాయ భూమి ఉండి.. పట్టాదార్‌ పాసుపుస్తకం ఉన్న రైతు సహజంగా మరణించినా.. యాక్సిడెంట్‌ అయినా.. ఏ కారణంతో చనిపోయినా ఈ పథకం కింద రూ.5లక్షల పరిహారం అందేది. ఈ పథకాన్ని 2018లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రారంభించింది. వ్యవసాయ భూమి ఉన్న 18 నుంచి 59 ఏళ్ల రైతులను లబ్ధిదారులుగా చేర్చింది. ప్రారంభంలో ఒక్కో రైతు పేరిట ప్రభుత్వం ఎల్‌ఐసీకి రూ.2,271 ప్రీమియంగా చెల్లించేది. తర్వాత ప్రీమియం మొత్తం పెరగగా.. ఒక్కో రైతుకు రూ.3,556 చొప్పున చెల్లించారు. బీమా పరిహారం దళారుల ప్రమేయం లేకుండా కేవలం వారంరోజుల వ్యవధిలో రైతు కుటుంబాలకు అందింది. రైతు చనిపోయినట్లు సర్టిఫికెట్‌, మరికొన్ని వివరాలను వ్యవసాయ శాఖ ఏఈవోకు అందిస్తే.. రైతు భార్య లేదా కుటుంబసభ్యుల ఖాతాలో రూ.5లక్షలు జమయ్యేవి. అప్పటినుంచి ఇప్పటివరకు చనిపోయిన వారి రైతు కుటుంబాలకు అందిన బీమా పరిహారం.. ఈనెల 15 నుంచి అందకుండా పోనుంది.

రైతుల ఎదురుచూపులు

జిల్లాలో రైతుబీమాకు అర్హులైన రైతులు 1,35,813 మంది ఉన్నారు. 2023లో 769 మంది రైతులు చనిపోగా 762 మంది రైతులకు రూ.38.10కోట్ల బీమా అందింది. 2024లో 718 మంది రైతులు చనిపోగా.. 711 మందికి రూ.5 లక్షల చొప్పున రూ.35.55కోట్లు, 2025లో 668 మంది చనిపోగా..581 మందికి రూ.29.05కోట్లు అందాయి. సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా ఏటా 10 నుంచి 20 క్లెయిమ్స్‌ తిరస్కరించారు.

తోటను చదునుచేస్తున్న రైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement