పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో భారీ ఏర్పాట్లు
జగిత్యాల: జిల్లాలో 80వ స్వాతంత్య్ర వేడుకలకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో పతాకావిష్కరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. వీవీఐపీ, వీఐపీలు కూర్చునేందుకు టెంట్లు, కార్పెట్లు సమకూర్చారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ రామ్మోహన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కార్యక్రమానికి వచ్చే ప్రజలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరేడ్ గ్రౌండ్‌లోకి అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నారు.
పతాకావిష్కరణ చేయనున్న మంత్రి అజారోద్దీన్
శనివారం ఉదయం 9.30 నుంచి 9.35 గంటలకు మైనార్టీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి అజారోద్దీన్ పతాకావిష్కరణ చేస్తారు. 9.35 నుంచి 9.45 వరకు పోలీసుల గౌరవ వందనం, 9.45 నుంచి 9.55 వరకు ముఖ్య అతిథి సందేశం, 9.55 నుంచి 10.15 వరకు శకటాల ప్రదర్శన, 10.15 నుంచి 10.40 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 10.40 నుంచి 11.30 వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ప్రశంసాపత్రాల ప్రదానం, లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ, 11.30 నుంచి 12కు వరకు స్టాల్స్ సందర్శన, స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ, తదుపరి వందన సమర్పన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
గట్టి బందోబస్తు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో డీఎస్పీ పురుషోత్తంరెడ్డి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పల్లి తదితర పట్టణాల్లో బాంబ్ డిస్పోజల్ టీం, పోలీసు శునకాలతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మార్కెట్లు ప్రాంతాల్లో ముందస్తు భద్రత చర్యలు చేపట్టారు.


