జగిత్యాల: జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, పురోగతి ఎక్కడా సంతృప్తికరంగా లేదని, కాంట్రాక్టర్లు జాప్యం చేస్తే అధికారులు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ధర్మపురి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో ఏమాత్రం పురోగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజూరైన అన్ని పనులకు టెండర్ పూర్తి చేయాలన్నారు. సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టే రూ.5 లక్షల పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. రోళ్లవాగు షెటర్ పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అక్కపల్లి లిఫ్ట్ జనవరి వరకు పూర్తిచేయాలన్నారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ధర్మపురి పట్టణంలో ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు ప్రారంభించాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గంలో రూ.463 కోట్ల విలువైన 26 పనులు మంజూరయ్యాయని, అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ పరిధిలో రూ.153 కోట్ల విలువైన 396 పనులకు రూ.31 కోట్ల విలువైన 96 పూర్తయ్యాయన్నారు. అమృత్ 2.0 కింద రూ.23 కోట్లతో చేపట్టిన పనుల్లో 77 శాతం పూర్తయ్యాయన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్ పాల్గొన్నారు.
ముస్లింల సంక్షేమమే ధ్యేయం
ధర్మపురి: ముస్లిం సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి అడ్లూరి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 39 మందికి రూ.19.50 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, కమిషనర్ శ్రీనివాస్, ముస్లిం నాయకులు తదితరులున్నారు. ముందుగా ఉపాధి హామీలో పనిచేస్తున్న తమకు న్యాయంచేయాలని ఫీల్డ్ అసిస్టెంట్లు మంత్రి అడ్లూరికి వినతిపత్రం సమర్పించారు. సంఘం అధ్యక్షుడు గడ్డం రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నం రాజాగౌడ్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మహేష్, బాల్‌రాజ్, అనిత, సుజాత తదితరులున్నారు.
అమ్మవారికి మొక్కులు
వెల్గటూర్: ఆషాఢమాసం ముగింపు సందర్భంగా మంత్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎండపల్లి మండలం అంబరిపేటలో స్థానికులు రోడ్డు మైసమ్మ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ నరేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, నాయకులు పాల్గొన్నారు.


