గొల్లపల్లి: బడి గంట మోగి రెండు నెలలవుతున్నా.. ప్రభుత్వ పాఠశాలలకు అందాల్సిన ‘స్కూల్ గ్రాంట్స్’ (నిర్వహణ నిధులు) ఇంకా విడుదల కాలేదు. దీంతో పాఠశాలల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. విద్యాశాఖ నుంచి నయాపైసా రాకపోవడంతో ప్రధానోపాధ్యాయులే తమ సొంత డబ్బులను వెచ్చించి బడులను నడిపించాల్సి వస్తోంది. ఈ నిధుల కొరత మరో మూడు రోజుల్లో నిర్వహించే పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపైనా తీవ్ర ప్రభావం చూపనుంది.
సొంత డబ్బులే శరణ్యం
సాధారణంగా పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం రెండు విడతల్లో నిధులు మంజూరు చేస్తుంది. అందులో మొదటి విడత జూలై మొదటి వారంలోనే విడుదల కావాల్సి ఉన్నా, ఇప్పటికీ నయాపైసా అందలేదు.
అత్యవసర కొనుగోళ్లు
ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులతో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్లు, చాక్‌పీస్‌లు, ల్యాబ్ సామగ్రి, పాఠశాలల్లో చిన్నపాటి మరమ్మతు చేయించాల్సి ఉంటుంది. అలాగే పరీక్షల నిర్వహణకు వెచ్చించుకోవచ్చు. కానీ.. నిధులు రాకపోవడంతో ఆ ఖర్చులన్నింటికీ ఉపాధ్యాయులే తమ సొంత సొమ్మును వెచ్చిస్తున్నారు. ఈ పరిస్థితి జిల్లాలోని 782 ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొంది.
క్రీడలకు కష్టం.. వేడుకలకు గ్రహణం
త్వరలోనే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు ప్రారంభం కానున్నాయి. క్రీడా సామగ్రి కొనుగోలుకు నిధులు రాకపోవడంతో విద్యార్థులకు సరైన శిక్షణ ఇవ్వలేకపోతున్నామని ఉపాధ్యాయులు అంటున్నారు. మరోవైపు మూడు రోజుల్లో జరగనున్న స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు కూడా చేతిలో డబ్బులు లేక హెచ్‌ఎంలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉపాధ్యాయుల విజ్ఞప్తి
పాఠశాలల పూర్వ వైభవానికి, విద్యార్థుల భవిష్యత్తుకు భంగం కలగకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న స్కూల్ గ్రాంట్స్‌ను తక్షణమే విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, హెచ్‌ఎంలు కోరుతున్నారు.
విద్యార్థుల సంఖ్య, కేటాయించే నిధులు ఇలా..
విద్యార్థులు నిధులు(రూ.లలో)
30 మంది 10,000
31 నుంచి 100 25,000
101 నుంచి 250 50,000
వెయ్యి మంది 1,00,000


