దరఖాస్తు చేసుకోవాలి
జగిత్యాల: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అర్హులకు చేయూత పథకం పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 15 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన సర్కారు.. మొదటి విడతలో ఏడు రకాల పింఛన్లు అందించనుంది. ఒంటరి మహిళ, వితంతువులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, బోదకాలు, డయాలసిస్, దివ్యాంగుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. దశలవారీగా దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందంటున్నారు. వృద్ధాప్య పింఛన్ల విషయం ఇంకా కొలిక్కి రాలేదు. వారికి ఇప్పట్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది.
ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో..
అర్హులు కొత్తగా రూపొందించిన దరఖాస్తు ఫారాలను పూరించి ఆధార్‌కార్డు, ధ్రువపత్రాలు జతపర్చి గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీవో కార్యాలయంలో.. పట్టణ ప్రాంతాల వారు మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లకు అందించాల్సి ఉంటుంది. ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేశాక ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులా..? కాదా..? అన్నది నిర్ధారించనున్నారు. ఈ యాప్‌లో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కారు, బైక్, ఆటో వంటి వాహనాలు, సొంత భూములు, ఇతర ఆదాయ వనరులు ఉన్నాయా..? లేదా..? అన్నది తేల్చాక పింఛన్ అందిస్తారు.
వృద్ధాప్య పింఛన్లు ఎప్పుడో..?
జిల్లాలో అత్యధికంగా వృద్ధాప్య పింఛన్లు ఉన్నాయి. చాలామంది పింఛన్ల కోసమే ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కేవలం ఏడు రకాల పింఛన్లకు ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. అనంతరం దశల వారిగా మళ్లీ వారికి సైతం స్వీకరించనున్నట్లు పేర్కొంటున్నప్పటికీ ఈసారి వస్తాయా..? లేదా..? అని వారు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో ప్రస్తుతం అందుతున్న పింఛన్ల వివరాలు
వృద్ధులు 57,959
వితంతువులు 43,332
దివ్యాంగులు 16,099
గీతకార్మికులు 3,300
చేనేత కార్మికులు 2,059
పైలేరియా 1,600
ఒంటరి మహిళలు 4,530
బీడీ కార్మికలు 88,405
బీడీ టేకేదారులు 750
చేయూత పింఛన్ల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలి. ఫారాలు నింపి గ్రామీణ ప్రాంతాల్లోని వారు పంచాయతీ కార్యదర్శులకు, మున్సిపాలిటీ ప్రజలు వార్డు ఆఫీసర్‌కు ఇవ్వాలి. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం పింఛన్లు మంజూరవుతాయి. ప్రస్తుతం ఏడు రకాల పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
– రఘువరణ్, డీఆర్డీఏ పీడీ


