● తప్పుల తడకగా రిపోర్ట్‌లు
● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు
● డీఎంహెచ్‌వోకు బాధితుడి ఫిర్యాదు
జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గంగాధర్ సతీమణికి కిడ్నీ సమస్య ఉండటంతో జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్‌లో గల ఓ డయాగ్నోస్టిక్ కేంద్రానికి వెళ్లారు. ఆ సెంటర్‌లో సిటీక్యూబ్ స్కానింగ్ చేయించగా, నో ఎవిడెన్స్ ఆఫ్ రినాల్ కాల్యుకులేషన్ (కిడ్నీలో రాళ్లు లేవు) అని రిపోర్ట్ వచ్చింది. ఆమె తీవ్రమైన నొప్పితో బాధపడగా, అదేరోజు గొల్లపల్లి రోడ్‌లోని మరో డయాగ్నోస్టిక్ సెంటర్‌లో స్కానింగ్ చేయించారు. అందులో కుడి కిడ్నీలో 7.3 మి.మీ పరిమాణంలో రాయి ఉందని నిర్ధారించారు. అనంతరం వైద్యుల సూచనలతో చికిత్స చేయించి రాయిని తొలగించారు. కాగా, తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన స్కానింగ్ నిర్వాహకులను అడుడగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు.
రిపోర్ట్‌లలో తప్పులు
జిల్లా కేంద్రం.. చాలా మంది వైద్య చికిత్సల నిమిత్తం జగిత్యాలకు వస్తుంటారు. ఏదైనా ప్రమాదం జరిగినా, కిడ్నీల్లో నొప్పి వచ్చినా, బ్రెయిన్ సమస్య ఉన్నా వ్యాధిని బట్టి స్కానింగ్ సెంటర్లకు రాస్తుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్న తప్పుడు రిపోర్ట్‌లతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. స్కానింగ్ సెంటర్లపై వైద్యశాఖ నిఘా పెట్టకపోవడం, తనిఖీలు చేయక వారు ఆడిందే ఆటగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వేలల్లో ఫీజులు
జిల్లాలో సుమారు 70కి పైగానే స్కానింగ్ సెంటర్లున్నాయి. వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న సెంటర్లలో ఎవరి రిపోర్ట్ నమ్మాలో, ఎవరిది నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాలవారే ఎక్కువగా రావడం, వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు అందినంత దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చిన్నపాటి స్కానింగ్‌కు రూ.3 వేలకు పైగా ఉంటుంది. వైద్యశాఖ అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడం, తనిఖీల్లో కొన్ని ఆస్పత్రుల్లో అనుమతి లేని యంత్రాలు ఉన్నట్లు గుర్తించిన సంఘటనలున్నాయి.
నిబంధనలు పాటించాలి
స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టాం. నిబంధనల ప్రకారం నిర్వహించాలి. రోగులను ఇబ్బందులకు గురిచేయొద్దు. ముఖ్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదు. ఏదైనా సమస్యపై స్కానింగ్ సెంటర్లపై ఫిర్యాదు చేస్తే విచారణ చేపడతాం.
– జైపాల్‌రెడ్డి,
డెప్యూటీ డీఎంహెచ్‌వో


