కోరుట్ల: 1930లో రూపొందించిన గ్రామాల టిఫ్పన్‌లు, కాస్రా నకలు కాపీలు కాలం చెల్లిపోవడంతో ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో భూవివాదాల సమస్యలు తీవ్రమవుతున్నాయి. దీనికి తోడు ఇదివరకు విలేజ్ మ్యాప్‌లు, భూముల హద్దుల నిర్ధారణ లేని గ్రామాల్లోనూ కొత్తగా మ్యాప్‌ల తయారీకి భూముల రీసర్వే చేసి భూధార్ నంబర్ల కేటాయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పనులు జనవరిలో మొదలుపెట్టారు. ఈ పనుల కింద జిల్లాలో ప్రతీ మండలానికి 3 గ్రామాల చొప్పున మొత్తం 90 గ్రామాలు ఎంపిక చేశారు. వీటిలో 70 గ్రామాలు ఇదివరకు విలేజ్‌మ్యాప్ ఉన్నవే కాగా.. 20 గ్రామాల్లో కొత్తగా విలేజ్ మ్యాప్ రూపొందించాల్సి ఉంది. ఆయా గ్రామాల్లో ప్రస్తుతం రీసర్వే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. సర్వే కోసం జిల్లాలోని 10 మంది ప్రభుత్వ సర్వేయర్లతో పాటు 196 మంది లైసెన్స్ సర్వేయర్లను నియమించారు. వీరు ఆరు నెలలుగా నిర్ధారించిన గ్రామాల్లో రీసర్వే పనులు కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కొలతల కోసం 70 నుంచి 80 జీపీఎస్ సర్వే సిస్టమ్ మిషన్లు కావాల్సి ఉండగా కేవలం 30–40 మిషన్లు ఉండటంతో కొలతల నిర్ణయించడం ఇబ్బంది కలుగుతోంది. దీనికి తోడు మధ్య ఇతరత్రా సర్వేలు రావడం, రెగ్యులర్‌గా భూముల కొలతలకు వచ్చే దరఖాస్తులను పరిశీలించాల్సి రావడంతో రీ సర్వేలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
ఎకరాకు రూ.60 మాత్రమే
జిల్లాలోని ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రభుత్వ సర్వేయర్లకు అనుసంధానంగా ఇటీవల ప్రభుత్వం నుంచి శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్లు జీపీఎస్ సిస్టమ్‌తో భూ హద్దుల కోసం రీసర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ భూములు, ఇళ్ల స్థలాలు, హద్దుల నిర్ణయానికి లైసెన్స్ సర్వేయర్లకు ఏలాంటి రుసుము చెల్లించడం లేదు. కేవలం పట్టా భూములకు మాత్రమే ఎకరాకు రూ.60 చొప్పున ఇస్తున్నారు. రోజూ ప్రభుత్వ సర్వేయర్‌తో కలిసి ఇద్దరు లైసెన్స్ సర్వేయర్లు ఎంపిక చేసిన గ్రామంలో 15 నుంచి 20 ఎకరాల మేర కొలతలు చేస్తున్నారు. దీంతో వారికి రోజుకు రూ.900 నుంచి రూ.1,200 వరకు గిట్టుబాటు అవుతున్నాయి. ఈ డబ్బులను ఇద్దరు లైసెన్స్ సర్వేయర్లు పంచుకోవాల్సి ఉండటంతో ఒక్కో సర్వేయర్‌కు రోజుకు రూ.500–600 మాత్రమే వస్తున్నాయి. ఈ డబ్బుల్లోనే కొలతలు చేయాల్సిన గ్రామాలకు వెళ్లాల్సిన ట్రావెల్ చార్జీలు సైతం ఉంటాయి. ట్రావెలింగ్ ఖర్చులు పోగా ఒక్కో సర్వేయర్‌కు కేవలం రూ.300– 400 మాత్రమే వస్తున్నాయి. ఈ లెక్కన ప్రతీ నెలా వారికి కేవలం రూ.10 వేల నుంచి 12వేలు మాత్రమే వేతనం వస్తున్నట్లు లెక్క. ఈ చిన్నపాటి వేతనానికి పొద్దంతా కష్టపడి రీసర్వే కార్యక్రమం ముగించడానికి అవస్థలు పడుతున్నారు. వేతనాలు తగు రీతిలో పెంచి కష్టానికి తగిన ప్రతిపలం ఇవ్వాలని లైసెన్స్ సర్వేయర్లు కోరుతున్నారు.
‘హోటల్‌లో పనిచేసే కార్మికుడికి రోజూ రూ.800 వరకు చెల్లిస్తున్నారు. వ్యవసాయ కార్మికుడికి ఎంత తక్కువ అనుకున్నా రోజుకు రూ.1,200– 1,500 వరకు గిట్టుబాటు అవుతున్నాయి. ఇదేమి చిత్రమో కానీ.. భూములు సర్వే చేయడానికి లైసెన్స్ పొంది నైపుణ్యం ఉన్న సర్వేయర్లకు మాత్రం సర్కార్ ఒక్క రోజుకు కేవలం రూ.400–600 మాత్రమే లెక్కకట్టి ఇవ్వడం విడ్డూరంగా తోస్తోంది’.


