జగిత్యాల: జిల్లాలోని 20 మండలాలు, ఐదు మున్సిపాలిటిలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాలకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రధాన కేంద్రంగా మారింది. జిల్లాలోని జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను జగిత్యాల జనరల్ ఆస్పత్రికి తీసుకొస్తుంటారు. ఇక్కడ ట్రామాకేర్ యూనిట్ లేక ప్రథమ చికిత్స చేసి కరీంనగర్, హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో వారానికి 10–20 రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడి ఆస్పత్రిలో మౌలిక వసతులు లేక రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సరైన చికిత్స అందడం లేదు.
మొదటి గంట గోల్డెన్ అవర్
ట్రామా కేర్ యూనిట్ అందుబాటులో ఉంటే రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి తక్షణమే చికిత్స అందిస్తే బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణం వైద్య సాయం అందించాలని ప్రతీ ఆస్పత్రిలో ట్రామాకేర్ యూనిట్ ఏర్పాటు చేయాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, ఇప్పటి వరకు జిల్లాలోని ఏ ఆస్పత్రిలో ట్రామా కేర్ యూనిట్ ఏర్పాటు చేయలేదు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని జగిత్యాల ఆస్పత్రిలో సెంటర్ ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
అమలుకు నోచుకోని ట్రామాకేర్
గత ప్రభుత్వ హయాంలో జిల్లా ప్రజాప్రతినిధులు ట్రామాకేర్ యూనిట్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో స్థలాన్ని సైతం పరిశీలించారు. కానీ, అమలుకు నోచుకోలేదు. సెంటర్ ఏర్పాటు చేస్తే ప్రత్యేక సిబ్బంది కావాల్సి ఉండటంతో ముందుకు రానట్లు తెలిసింది. ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా వైద్య వ్యవస్థపై సమావేశం జరిగింది. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మెడికల్ కళాశాల పనులతో పాటు, జనరల్ ఆస్పత్రిలో వెల్‌నెస్ సెంటర్, ట్రామా సెంటర్ ఏర్పాటు చేయాలని కోరగా, మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈసారైనా కార్యరూపం దాలుస్తుందని ప్రజలు భావిస్తున్నారు.


