జగిత్యాల: తొలగించిన ప్రతి పేరును బీఎల్వోలు పరిశీలించాలని, జిల్లాలో 89.50 శాతం ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తియిందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బీఎల్వోలతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 7,21,032 మంది ఓటర్లలో ఇప్పటి వరకు 6,45,737 మంది ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజ్ పూర్తయిందన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియలో 13,885 మంది మరణించిన ఓటర్లు, 47,142 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినవారు, 2482 మంది గుర్తించలేని ఓటర్లు, 11,234 మంది ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో నమోదైన ఓటర్లను గుర్తించినట్లు చెప్పారు. జిల్లాలో సుమారు 43 వేల మందికి ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించినా మ్యాపింగ్ లింక్ అందుబాటులో లేక వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిర్ధేశించిన 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పిస్తే వారి పేర్లను ఓటరు జాబితాలో చేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితాను ప్రదర్శిస్తామని, సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించి, అక్టోబర్ 19 నాటికి ఓటరు జాబితా విడుదల చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ లత తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలు వేయండి
జగిత్యాలఅగ్రికల్చర్: ఎల్‌నినో ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాలు తగ్గు ముఖం పట్టే అవకాశం ఉందని కలెక్టర్ సత్యప్రసాద్ ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఎల్‌నినో తీవ్రమయ్యే అవకాశం ఉందని, రైతులు వరికి బదులు ప్రత్యామ్నయ పంటలు సాగు చేయాలని సూచించారు. జిల్లాలో మొత్తం 1010 చెరువులకు 268 చెరువులు మాత్రమే పూర్తిగా నిండినట్లు పేర్కొన్నారు. గతేదితో పోల్చితే జిల్లాలో భూగర్భజలాల నీటి మట్టం ఇప్పటికే సగటున 1.12 మీటర్లు తగ్గినట్లు తెలిపారు. ఎస్సారెస్పీ నుంచి తాగునీటి విడుదలకే అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రైతులు వరికి బదులు తక్కువ నీటి అవసరం ఉన్న కందులు, పెసర, మినుములు, ఆముదం, జొన్న, సజ్జ, మొక్కజొన్న పంటలను వేయాలని సూచించారు.


