జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాకు సాగు, తాగు నీరు అందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 61,111 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1,091 అడుగులకు గాను 1,070 అడుగులకు చేరింది. అలాగే, నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు 23.308 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 300, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 291 క్యూసెక్కులు వృథా అవుతోంది.
నిధులు మంజూరు చేయించాలి
కోరుట్ల/కోరుట్లరూరల్: మండలంలోని కల్లూర్–సర్పరాజ్‌పూర్ గ్రామాల మధ్య వాగుపై హైలెవల్ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, కలెక్టర్ సత్యప్రసాద్‌ను కోరారు. శుక్రవారం వంతెనను ఎమ్మెల్యే పరిశీలించారు. వాగు ప్రవాహానికి వంతెనపై భగీరథ పైపులు కొట్టుకుపోవడంతో ప్రజలు నీటికోసం ఇబ్బంది పడే పరిస్థితి ఉందని కలెక్టర్‌కు ఫోన్ ద్వారా వివరించారు. పైపులను వెంటనే పునరుద్ధరించాలని పేర్కొన్నారు. సర్పంచ్ నత్తి రాజ్‌కుమార్, నాయకులు వనతడుపుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
బీర్‌పూర్‌లో 140.3 మి.మీ వర్షం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రెండురోజులు గా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా సాధారణ వర్షపాతం 437.4 మి.మీ కాగా, భారీ వ ర్షాలతో 544.0 మి.మీ చేరింది. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు బీర్‌పూర్ మండలంలో అత్యధికంగా 140.3 మి.మీ వర్షపాతం నమోదు కాగా, ఇబ్రహీంపట్నం 60.5, మల్లాపూర్ 65.8, రాయికల్ 77.5, సారంగాపూర్ 110.7, ధర్మపురి 95.0, బుగ్గారం 107.0, జగిత్యాలరూరల్ 74.5, జగిత్యాల 65.7, మేడిపల్లి 71.4, కోరుట్ల 56.6, మెట్‌పల్లి 77.1, కథలాపూర్ 64.1, కొడిమ్యాల 79.2, మల్యాల 80.8, పెగడపల్లి 65.8, గొల్లపల్లి 83.2, వెల్గటూర్ 129.1, ఎండపల్లి 99.7, బీమారంలో 59.8 మి.మీ నమోదైంది. జిల్లాలో సగటున 83.2 మి.మీ వర్షం కురిసింది.
బట్టపల్లి శివారులో కొట్టుకుపోయిన రోడ్డు
జగిత్యాలరూరల్: భారీ వర్షాలకు సారంగాపూర్ మండలం బట్టపల్లి శివారు చింతలపల్లి సమీపంలో బతుకమ్మ ఒర్రె ప్రవాహానికి రోడ్డు కొట్టుకుపోయింది. మరమ్మతు చేపట్టాలని సర్పంచ్ మర్రిపల్లి అశ్విని కోరారు.
పొలాల్లో ఇసుక మేటలు
ధర్మపురి: మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మండలంలోని దమ్మన్నపేట, రాజారం, జైనా, దొంతాపూర్ గ్రామాల్లోని పంటపొలాల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుచున్నారు.
ఇళ్లు మంజూరు చేయాలి
జగిత్యాలరూరల్: బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్లకు చెందిన సింగారపు రవి ఇల్లు ఇటీవల వర్షాలకు కూలిపోగా శుక్రవారం పరిశీలించి ఆర్థికసాయం అందజేశారు. రెవెన్యూ అధికారులు బాధితులను గుర్తించి సత్వరమే వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు, నాయకులు పాల్గొన్నారు.


