తరాలుగా జాతి అణచివేతకు ముగింపు పలకాలని తపించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. అణగారిన వర్గాలకు ఆసరాగా ఉండేందుకు రాజ్యాంగంలో హక్కులు కల్పించాడు. ఇది జరిగి ఏడు దశాబ్దాలవుతున్నా.. ఆ ఫలాలు మాత్రం దళిత వర్గాలకు అందడం లేదు. మహా నేతల జయంతి, వర్ధంతి రోజుల్లో తప్పితే దళితుల గురించి పట్టని ప్రజాప్రతినిధుల పాలనలో దళితుల సంక్షేమం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మారింది. సబ్ ప్లాన్ చట్టం తెచ్చామని ప్రకటించుకున్న పాలకులు ఆ నిధులను వేరే పనులకు మళ్లించి ఎక్కడి సమస్యలను అక్కడే పెంచి పోషించారు. ఫలితంగా కొన్నేళ్లుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
కరీంనగర్‌టౌన్: ప్రతీ 3 నెలలకోసారీ దళిత సమస్యలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తాం.. సమస్యలేమైనా ఉంటే సత్వర పరిష్కారానికి చొరవ చూపుతాం.. దళిత వర్గాలకు వెన్నంటి ఉంటామని ప్రకటించడం మంత్రులు, ప్రజాప్రతినిధులకు రివాజుగా మారింది. దళితులపై దాడుల నివారణకు ఏర్పడ్డ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ పక్కాగా పని చేయాల్సింది పోయి నామ్‌కే వాస్త్ కమిటీగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. కొత్త కమిటీ నియామకం జరగలేదు. నగరం నడిబొడ్డున గల అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులకు రెండున్నరేళ్లుగా కోచింగ్ ఉత్త మాటగానే మారింది. బెస్ట్ అవెలెబుల్ స్కీం కింద ఎస్సీ విద్యార్థులకు జిల్లాలో రూ.కోటికి పైగా పెండింగ్ బకాయిలున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాల ప్రతిష్ఠాపనలకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీలింగ్ భూముల పంపిణీ పథకం నత్తనడకన కొనసాగుతోంది. నిరుద్యోగ యువతి, యువకులు స్వయం ఉపాధి పొందేందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాల ప్రక్రియ ఎండమావిగా మారింది. కోర్టు చౌరస్తా వద్ద ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ భవనం కోసం కేటాయించిన 6 గుంటల స్థలాన్ని ఇతరులు ఆక్రమించినా చర్యలు తీసుకోకపోవడం, కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న అంబేడ్కర్ భవన సముదాయానికి కేటాయించిన 19 గుంటలు స్థలం కబ్జా చేసిన వారి కబందా హస్తాల నుంచి నేటికి విముక్తి కల్పించకపోవడం, చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో లీడ్ క్యాప్ భూములను పోలీసు బెటాలియన్‌కు కట్టబెట్టడం, లోయర్ మానేరు డ్యాంలో ముంపునకు గురైన గ్రామాల బాధితులకు కేటాయించిన స్థలాల్లో పట్టాలిచ్చి రెండున్నర దశాబ్దాలు గడుస్తున్నా హద్దులు చూపకపోవడం, జిల్లావ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి భూకొనుగోలు పథకం కింద ఎస్సీలకు కేటాయించిన భూములకు సంబంధించి నేటికి అక్కడక్కడ పట్టా పాస్ బుక్‌లు అందకపోవడం, పట్టాలిచ్చిన వారికి హద్దులు చూపకపోవడం వంటి సమస్యలు కోకొల్లలు.
● జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, సీపీ, ఏసీపీలు, డీఎస్పీలు, ఆర్డీవో, డీఆర్‌వో, ప్రజాప్రతినిధులు, సంక్షేమ శాఖ అధికారులు దళిత వర్గాల నుంచి కమిటీని వేసి జిల్లాలో ఎస్సీలకు అమలవుతున్న పథకాలు, భూముల పంపిణీ, ఎస్టీ, ఎస్టీలపై అత్యాచార యత్నాలు, నేరాలు, భౌతిక దాడులు, వేధింపులు తదితర కేసులను పరిశీలించాల్సిన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నామమాత్రంగా మిగిలిందనే విమర్శలున్నాయి.
● ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ పంపిణీ పథకం ఒక అడుగు ముందుకు... రెండడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది.
● ఎస్సీ, ఎస్టీలకు భారీగా లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు కొత్తకొత్త రాయితీలు ప్రకటించడం, అనేక కొర్రీలతో నిబంధనలు రూపొందించడంతో నిరుద్యోగ అర్జీదారులు బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టడానికే పరిమితమవుతున్నారు.
● చొప్పదండి మండలం రుక్మాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 513, 514, 516లో నాటి ముఖ్య మంత్రి చంద్రబాబు హయాంలో మలుపు పథ కం ద్వారా లీడ్ క్యాప్ పరిశ్రమను పెట్టి నిరుద్యోగ దళిత యువత, చర్మకారులకు ఉపాధి చూపిస్తామని ప్రభుత్వం 135 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ప్రారంభోత్సవాలు చేసిన మంత్రులు, అధికారులు అదే స్థలాన్ని నాటి కలెక్టర్ జి.డి.అరుణ హయాంలో పోలీస్ బెటాలియన్ కు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. లీడ్ క్యాప్ లొల్లి హైదరాబాద్‌కు చేరి నేటికి తెగని పంచాయితీగా తయారైంది.
● 25 ఏళ్ల క్రితం ఎల్‌ఎండీలో ముంపునకు గురైన హస్నాపూర్ గ్రామ దళితులకు ఎస్సారెస్పీ భూమిని నివేశన స్థలాల కోసం కేటాయిస్తూ పట్టాలిచ్చారు. పట్టాలు అందుకున్న వారిలో అనర్హులే చాలామంది ఉన్నారు.
● కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని అంబేడ్కర్ భవన సముదాయానికి కేటాయిస్తూ అప్పటి జిల్లా కలెక్టర్ సుమితాడావ్రా హయాంలో సర్వే నంబర్ 11404/22లో 19 గుంటల పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే. దళిత సంఘాలు అభ్యంతరం తెలపడంతో ప్రహరీ నిర్మించి వృథాగా వదిలేశారు.
● జాతీయ నాయకులైన డా.బీఆర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రాంల విగ్రహాలను జిల్లావ్యాప్తంగా ఆయా కుల సంఘాలు, దళిత సంఘాల నాయకులు సొంత ఖర్చులతో ఏర్పాటు చేసుకున్నారు. నిధుల లేమితో జిల్లావ్యాప్తంగా దాదాపు 15 పైగా విగ్రహాలు ముసుగులు తొడిగే ఉన్నాయి.
● నగరం నడిబొడ్డున అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో వివిధ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న ఎస్సీ నిరుద్యోగ యువతకు కొన్నేళ్లుగా ఏడాదిలో 2 కోచింగ్ బ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. రెండున్నరేళ్లుగా ఒక్క బ్యాచ్ కూడా నిర్వహించలేదు.
● ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అణగారిన వర్గాల విద్యార్థులకు ఉచిత విద్య, హాస్టల్ వసతి కొన్నేళ్లుగా కల్పిస్తున్నారు. మూడేళ్లుగా వారికి రావాల్సిన బకాయిలు విడుదల చేయలేదు.
75 ఏళ్ల రాజ్యాంగంలో హక్కులు డొల్ల
నామ్‌కే వాస్త్ అట్రాసిటీ కమిటీ
కదలని భూపంపిణీ పథకం
తెగని లీడ్ క్యాప్ భూకేటాయింపు లొల్లి
అటకెక్కిన సబ్ ప్లాన్ నిధులు
కబ్జాకు గురవుతున్న కమ్యూనిటీ స్థలాలు


