చందుర్తి(వేములవాడ): విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు విచక్షణ మరిచి ఆఫీస్ రూంలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం జరిగింది. వివరాలు.. బండపల్లి పాఠశాలలో 8మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. జూలై 1న ఉపాధ్యాయుడు రామచంద్రం పాఠశాలకు ఆలస్యంగా వచ్చాడు. ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ ద్వారా హాజరు నమోదు చేసుకున్నాడు. హెచ్‌ఎం ఆనందరెడ్డి మాత్రం రిజిస్టర్‌లో గైర్హాజరు వేశారు. అప్పటి నుంచి రామచంద్రం రిజస్టర్‌లో సంతకం చేయడం మరిచిపోయారు. ఈ వివాదంపై హెచ్‌ఎం మండల విద్యాధికారికి ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టారు. అయినా వారిలో మార్పు రాలేదు. ఈ విషయాన్ని హెచ్‌ఎం గురువారం డీఈవో దృష్టికి తీసుక్లెగా సర్దుకుపోవాలని ఆదేశించినట్లు సమాచారం. కాగా శుక్రవారం రిజిస్టర్‌లో రామచంద్రం సంతకాలు చేస్తుండగా, అక్కడే ఉన్న హెచ్‌ఎం డీఈవోకు ఫిర్యాదు చేశానని, ఆదేశాలు వచ్చే వరకు సంతకాలు చేయొద్దని అడ్డుకున్నాడు. దీంతో రామచంద్రం దుర్భాషలాడుతూ, తన కాలి చెప్పును తీయగా, కుర్చీలో ఉన్న హెచ్‌ఎం ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా, మిగతా ఉపాధ్యాయులు గొడవను నిలువరించారు. అనంతరం ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఎస్సై రమేశ్ విచారణ చేపట్టారు. నివేదికను అధికారులకు అందజేస్తామని ఎస్సై తెలిపారు.
వివాదానికి ఆజ్యంపోస్తున్న
సీనియర్, జూనియర్ పంచాయితీ
పాఠశాలలో హెచ్‌ఎం తర్వాత సీనియర్ ఉపాధ్యాయుడిగా ఉన్న రామచద్రంకు ఇన్‌చార్జి హెచ్‌ఎం బాధ్యతలు అప్పగించడం లేదని కొద్దిరోజులుగా పాఠశాలలో వివాదాలు కొనసాగుతున్నాయి. అంతలోనే జూనియర్ ఉపాధ్యాయుడు భూపతికి బాధ్యతలు ఇవ్వడంతో వివాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. సమ్మర్ వెకేషన్ 24 రోజుల పని దినాల వేతనాలను సీనియర్ కాకుండా జూనియర్ ఉపాధ్యాయులు భూపతి, హెచ్‌ఎం తీసుకోవడం కూడా గొడవకు ప్రధాన కారణమని గ్రామస్తులు తెలిపారు.


