మహిళలే నిర్ణేతలు | - | Sakshi
Sakshi News home page

మహిళలే నిర్ణేతలు

Jan 3 2026 7:20 AM | Updated on Jan 3 2026 7:20 AM

మహిళలే నిర్ణేతలు

మహిళలే నిర్ణేతలు

● ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల ● రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ ● జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో ఆశావహుల సందడి

జగిత్యాల: ప్రభుత్వం మున్సిపల్‌ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆ మేరకు అధికారులు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి వార్డుల వారీగా ఇప్పటికే ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఇందులో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. పురుషులు 1,12,898 ఉండగా, మహిళలు 1,21,015 ఉన్నారు. మహిళలే అత్యధికంగా ఉండటంతో వారి ఓట్లే కీలకం కానున్నాయి. ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించగా, అభ్యంతరాలు ఈనెల 5 వరకు స్వీకరించనున్నారు. తుది జాబితాను ఈనెల 10న రాజకీయ పార్టీల సమక్షంలో ప్రకటిస్తారు. తుది జాబితా విడుదలైన అనంతరం వార్డుల వారీగా ఎంత మంది ఓటర్లున్నారన్నది తెలుస్తుంది.

పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు

ఓటర్ల ఆధారంగా పోలింగ్‌ కేంద్రాలను మ్యాపింగ్‌ చేయడంతో కొన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్‌ కేంద్రాలు పెరిగాయి. జగిత్యాలలో 149, కోరుట్లలో 94, మెట్‌పల్లిలో 64 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటరు జాబితా, పోలింగ్‌ కేంద్రాల ముసాయిదాను కలెక్టరేట్‌తో పాటు, ఆర్డీవో, తహసీల్దార్‌, మున్సిపల్‌ కార్యాలయాల్లో ప్రదర్శించారు. మూడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం 5, 6 తేదీల్లో రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి 10న తుది జాబితాను ప్రకటిస్తారు. ఇప్పటికే 2025 అక్టోబర్‌ 31న ప్రకటించిన ఓటరు జాబితా ఆధారంగా ఏర్పాటు చేశారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో జగిత్యాలలో రెండు వార్డులు పెరుగగా, మిగతా మున్సిపాలిటీల్లో పెరగలేదు. నిబంధనల ప్రకారం 600 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం చొప్పున ఏర్పాటు చేశారు. 800లకు మించి ఓటర్లు ఉండకూడదు. ఒకవేళ ఒక పోలింగ్‌ కేంద్రంలో అత్యధికంగా ఓటర్లు ఉంటే మూడో కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా ఒకే కుటుంబంలో ఉండే ఓటర్లు ఒకే వార్డు, ఒకే పోలింగ్‌ కేంద్రం అన్న నిబంధన అమలు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఒకే ఇంట్లోని ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉండటంతో ఇబ్బందికరంగా మారింది.

ప్రతినిధుల చుట్టూ అభ్యర్థులు

మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతాయన్న భావనతో ఇప్పటికే అభ్యర్థులు ప్రధాన ప్రతినిధుల చుట్టూ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ అత్యధిక సీట్లు కై వసం చేసుకుని చైర్మన్‌ సీటును కై వసం చేసుకుంది. కొన్ని కారణాల వల్ల చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి రాజీ నామా చేయగా, ఒక రెండు సంవత్సరాల పాటు ఇన్‌చార్జి ఉండగా, చివరి సంవత్సరంలో కాంగ్రెస్‌ వచ్చాక కాంగ్రెస్‌ మద్దతుతో అడువాల జ్యోతి ఎన్నికై ంది. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెబుతూ కాంగ్రెస్‌ వైపు కొనసాగుతున్నారు. ప్రస్తుతం తలనొప్పి అంతా కాంగ్రెస్‌లోనే ఉంది. బీఆర్‌ఎస్‌కు ప్రధాన నాయకులు లేనప్పటికీ మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌లో మాత్రం ఇటు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, అటు సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మధ్యనే పోటీ నెలకొనే అవకాశాలున్నాయి.

రిజర్వేషన్లపై ఆందోళన

పాత రిజర్వేషన్లపై ఎన్నికలు జరుగుతాయా? మారుతాయా? అన్న ఆందోళనలో ఆశావహులు ఉన్నారు. ఇప్పటికే మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌ స్థానాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఏ విధంగా చేస్తారన్నది తెలియదు. ఆశావహులు రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో మున్సిపల్‌ చైర్మన్‌ బీసీ మహిళకు కేటాయించారు. ఈసారి జనరల్‌ వస్తే ఆశావహులు పోటీ చేయవచ్చని చూస్తున్నారు.

మున్సిపాలిటీ మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు

జగిత్యాల 96,411 46,794 49,596 21

కోరుట్ల 63,741 30,709 33,030 2

మెట్‌పల్లి 46,371 22,360 24,010 1

ధర్మపురి 14,222 6,826 7,393 3

రాయికల్‌ 13,195 6,209 6,986 0

మొత్తం 2,33,940 1,12,898 1,21,015 27

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement