పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ
ధర్మపురి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ.. దూరప్రాంతాల నుంచి కాలినడకన వస్తున్న పేదవిద్యార్థులకు సైకిళ్లు అందించేందుకు ఎన్నారైలు ముందుకొచ్చారు. సామాజిక సేవకుడు, ధర్మపురికి చెందిన రేణిగుంట రమేశ్ ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌కు స్పందించిన వివిధ దేశాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల ఎన్నారైలు, జిల్లా సత్యసాయి అభయహస్తం సభ్యులు, ఇతరులు ఏకంగా రూ.2.71 లక్షలు విరాళాల రూపంలో అందించారు. ఆ మొత్తంతో సుమారు 56 సైకిళ్లు కొనుగోలు చేసి ధర్మపురి, బీర్‌పూర్ మండలాలకు చెందిన విద్యార్థులకు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ చేతులమీదుగా పంపిణీ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాన్ని మంచి కోసం వినియోగిస్తున్న రమేశ్‌ను అభినందించారు. పదేళ్లుగా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతూ.. ప్రతినెలా నిరుపేదలకు సాయం అందిస్తుండడం గొప్ప విషయమని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతస్థితికి చేరుకోవాలని, పోలీస్‌శాఖ పక్షాన ఇద్దరు పేద విద్యార్థులకు రెండు సైకిళ్లను బహూకరిస్తామని ప్రకటించారు. శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనవంతుగా ఓ సైకిల్ అందిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐ రాంనర్సింహరెడ్డి, ఎస్సై మహేశ్, ఎంఈవో సీతామహాలక్ష్మి, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులున్నారు.


