గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిర్మల్ జిల్లాకు చెందిన కోత్వల్ కృష్ణ (43) గుండెపోటుతో మృతిచెందాడు. కృష్ణ జగిత్యాల పట్టణంలోని మార్కండేయనగర్‌కు చెందిన ఎక్కల్‌దేవి కృష్ణ వద్ద రూ.70వేలు తీసుకున్నాడు. అనంతరం రెండు ఫోన్‌నంబర్ల ద్వారా కృష్ణ సెల్‌ఫోన్‌కు ఫోన్‌పే చేయించాడు. ఆ రెండు నంబర్లు సైబర్‌క్రైంకు సంబంధించినవి కావడంతో ఎక్కల్‌దేవి కృష్ణ బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయ్యింది. బాధితుడు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు నవంబర్ 3న కోత్వల్ కృష్ణను అరెస్ట్ చేసి జగిత్యాల స్పెషల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో కృష్ణ సోమవారం ఉదయం ఛాతిలో నొప్పిగా ఉందని జైలు సిబ్బందికి తెలపడంతో జైలు సూపరింటెండెంట్ మొగిలేశ్ ఎస్కార్ట్ సిబ్బందితో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఆయన మృతివార్తను సబ్‌జైలర్ ఉన్నతాధికారులు, కుటుంబసభ్యులకు తెలిపారు. ఆర్డీవో మదుసూదన్, రెండో అదనపు జుడిషియల్ మేజీస్ట్రేట్ నిఖిష ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. జైలు సూపరింటెండెంట్ మొగిలేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో తీవ్రంగా రోధించారు. కృష్ణపై సూర్యపేట, ములుగు, కొత్తగూడెం, హైదరాబాద్, నిజామాబాద్, ఆర్మూర్‌లో పలు కేసులు నమోదై ఉన్నాయి. నిర్మల్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు ఉంది. మొత్తంగా అతడిపై సుమారు 50 కేసుల వరకు ఉన్నట్లు సమాచారం.
మృతునిది నిర్మల్ జిల్లా కేంద్రం
విచారణ చేపట్టిన ఆర్డీవో మధుసూదన్
కేసు నమోదు చేసిన పట్టణ సీఐ కరుణాకర్


