ప్రాణం తీసిన భూపంచాయితీ
● కనగర్తిలో ఒకరు మృతి
ఓదెల(పెద్దపల్లి): భూ పంచాయితీ ఓ రైతు ప్రాణం తీసింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. కనగర్తి గ్రామానికి చెందిన ఆది రాజయ్య(సన్నాఫ్ మల్లయ్య)ను ఇదే గ్రామానికి చెందిన ఆది రాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) పొలం వద్ద పిడిగుద్దులు గుద్ది, కాళ్లతో తన్ని బురదలో తొక్కి చంపేశాడు. పొత్కపల్లి ఎస్సై రమేశ్, మృతుడి కూతురు వొడ్నాల లావణ్య కథనం ప్రకారం.. కనగర్తిలో ఒంటరిగా ఉంటున్న రాజయ్య వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఆది రాజయ్య భూమి ఆయన పొలాన్ని ఆనుకొని ఉంది. ఇద్దరి భూముల మధ్య గెట్టు(ఒడ్డు) విషయంలో పలుమార్లు గొడవలు, కులపెద్ద మనుషుల సమక్షంలోనూ పంచాయితీలు జరిగాయి. సోమవారం ఉదయం ఆది రాజయ్య(సన్నాఫ్ మల్లయ్య) కూలీలతో పొలంలో పనులు చేయిస్తున్నాడు. ఈక్రమంలో ఒడ్డు వద్దగల హద్దు రాయిని రాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) పీకేశాడు. దానిని ఎందుకు పీకేశావని ఆదిరాజయ్య(సన్నాఫ్ మల్లయ్య) అడిగాడు. దీంతో ఆదిరాజయ్య(సన్నాఫ్ మల్లయ్య) చేతులతో పిడిగుద్దులు గుద్దాడు. కాళ్లతో తన్ని బురదలో తొక్కాడు. దీంతో బురదలో బొర్లపడి ముక్కు మూసుకుపోయి ఊపిరి ఆడక ఆది రాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కూతురు వొడ్నాల లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఘటనా స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి, ఏసీపీ కృష్ణ, పొత్కపల్లి, సుల్తానాబాద్ ఎస్సైలు రమేశ్, చంద్రకుమార్ పరిశీలించారు. పాత గొడవలను దృష్టిలో పెట్టుకుని తన తండ్రిని చంపేశారని మృతుడి కూతుళ్లు బోరున విలపించారు. వరి నాట్ల సమయంలో రైతు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముగిసిన ఎస్జీఎఫ్ కరాటే టోర్నీ
కోల్‌సిటీ(రామగుండం): నగరంలోని ఆర్‌సీవోఏ క్లబ్‌లో అండర్–17 చేపట్టిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి కరాటే టోర్నీ, ఎంపిక పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి సుమారు 240 మంది బాలబాలికలు హాజరయ్యా రు. ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ నేతృత్వంలో పోటీలు నిర్వహించా రు. దాసరి మల్లేశ్ పర్యవేక్షించారు. ఇన్‌చార్జి డీఈవో హనుమంతు హాజరై మాట్లాడారు. ప్రతినిధులు కరాటే శ్రీనివాస్, వడ్డేపల్లి సురేశ్, పసునూటి శంక ర్, మంధని నాగరాజు, పసునూటి చందు, శ్రావణ్ కుమార్, సుంకే రాజు, బండి పరమేశ్, పవన్, బోయపోతు రాము, అన్వేశ్ రిఫరీలుగా వ్యవహరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోచ్, మేనేజర్లుగా ముక్తిశ్రీ, సునేహ సుల్తానా పాల్గొన్నారు.
13 బంగారు పతకాలు.. జాతీయ పోటీలకు 13 మంది..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 13 మంది క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. వచ్చే ఏడాది జనవరిలో పుణెలో జరగనున్న జాతీయస్థాయి ఎస్‌జీఎఫ్‌ఐ పోటీలకు 13 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. బంగారు పతకాలు సాధించినవారిలో సృష్టి టుమానే, శ్రీహర్ష, శ్రీవల్లి, పి.శ్రీజ, బి.సహస్త్ర, పి.సహస్త్ర, శ్రీరాజ్ విఘ్నేశ్, టి.జయసాయిచరణ్, ఆకాశ్, డి.శివహర్షవర్ధన్, డి.దేవాన్ష్ ఉన్నారు. ముగింపు కార్యక్రమంలో గోదావరిఖని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు డి.మాధవరావు, ప్రధాన కార్యదర్శి గడ్డం శ్యామ్‌కుమార్, కోశాధికారి రాజ్‌కుమార్, ఉపాధ్యక్షుడు కేఎస్ వాసు, రాష్ట్ర పేట అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొమురోజు శ్రీనివాస్, శోభారాణి, జావిద్, విజయ్, ఖాజాభీ రమేశ్, కనకేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటం
కరీంనగర్‌టౌన్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి, పోరాటాలకు విద్యార్థులు సిద్ధం కావాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగారపు రజనీకాంత్ పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక తెలంగాణ చౌక్ నుంచి మహాత్మ జ్యోతిరావు పూలే గ్రౌండ్ వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా సమానమైన విద్యను అందించేందుకు ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు ఆసంపల్లి వినయ్ సాగర్, గట్టు ఆకాష్, రాకేశ్, సందేశ్, మానస, సంజన, సన్నీ, అక్షయ్ పాల్గొన్నారు.
ప్రాణం తీసిన భూపంచాయితీ


