నాడు తండ్రి.. నేడు తల్లి..
జగిత్యాలక్రైం: ‘విధి ఆ చిన్నారుల పాలిట శాపంగా మారింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులిద్దరూ అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ముగ్గురు పిల్లలు దిక్కులేని వారయ్యారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో సోమవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం తలమాల గ్రామానికి చెందిన జ్యోతి 15 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోపాల్‌ను ప్రేమవివాహం చేసుకుని కల్లెడకు వచ్చింది. గ్రామంలోని ప్రభుత్వ భూమిలో గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. వీరికి అంజలి (13), చిన్ని (6), మురళీ (5) సంతానం. గోపాల్ ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి జ్యోతి ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తోంది. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న జ్యోతి కూడా చనిపోయింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో పంచాయతీ సిబ్బందే జ్యోతి తల్లి సోంబాయి, తండ్రి భీమ్ ఆటోలో కల్లెడకు తీసుకొచ్చారు. అనంతరం గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లో మాజీ సర్పంచ్ అంకతి గంగాధర్, కారోబార్ సురేందర్ కలిసి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి మృతదేహం వద్ద ముగ్గురు చిన్నారులు రోధనలు చూసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. తన అనేవారు లేని చిన్నారులను స్వచ్ఛంద సంస్థలైనా.. ప్రభుత్వమైనా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అనాథలైన ముగ్గురు చిన్నారులు


