గ్రామపంచాయతీలకు ఆర్థిక వనరులివే..
రాయికల్: గ్రామ పంచాయతీల్లో మరో వారం రోజుల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఈ క్రమంలో అందుబాటులో ఉండే ఆర్థిక వనరులు ఏమిటో తెలుసుకునేందుకు కొత్త పాలకవర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులే ప్రధాన ఆదాయం. సాధారణ నిధులు గ్రామాభివృద్ధికి తోడ్పడనున్నాయి.
కేంద్ర ఆర్థిక సంఘం నిధులు
గ్రామపంచాయతీల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం కేంద్రం జనాభా ప్రతిపాదికన నిధులు మంజూరు చేస్తుంది. నెలకు ఒక్కో వ్యక్తికి రూ.80 నుంచి రూ.90 చొప్పున కేటాయిస్తుంది. ఈ నిధులు ప్రతి మూడునెలలకోసారి ఏడాదిలో నాలుగు విడతలుగా అందిస్తుంది.
రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు
రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు క్రమం తప్పకుండా మంజూరు చేయాల్సి ఉంటుంది. గ్రామంలోని జనాభా ప్రతిపాదికన నిధులు మంజూరు చేస్తా రు. ఈ నిధులను మల్టీపర్పస్ వర్కర్లకు వేతనా లు, విద్యుత్ బిల్లులకు చెల్లించే అవకాశం ఉంది.
సాధారణ నిధులు
పంచాయతీలు సొంతంగా నిధులు సమకూర్చుకునే వాటిని సాధారణ నిధుల కింద గుర్తిస్తారు. ఈ నిధులు పెంచుకోవడానికి పంచాయతీల్లో ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాల్సి ఉంటుంది.
ఉపాధి హామీ నిధులు
గ్రామపంచాయతీల పరిధిలో చేపట్టిన ఉపాధిహామీ పనుల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తారు. కూలీలు చేసే పనులకు 60 శాతం, మరో 40 శాతం నిధులు మెటిరియల్, కంపోనెంట్ కింద మంజూరు చేస్తారు. ఈ నిధులతోనే గ్రామాల్లో సీసీరోడ్లు, మురికికాలువలు, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడతారు.
పన్నుల ద్వారా ఆదాయం
గ్రామపంచాయతీల పరిధిలో గృహ, ఇంటి నిర్మాణ అనుమతుల ద్వారా, ఆస్తిమార్పిడి, గ్రంథాలయ పన్ను ద్వారా గ్రామాలకు నిధులు సమకూరుతాయి.


