స్తంభంపల్లిలో మహిళ దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

స్తంభంపల్లిలో మహిళ దారుణ హత్య

Dec 10 2025 7:39 AM | Updated on Dec 10 2025 7:39 AM

స్తంభంపల్లిలో మహిళ   దారుణ హత్య

స్తంభంపల్లిలో మహిళ దారుణ హత్య

గుర్తు తెలియని వ్యక్తి మృతి బావిలో పడి వృద్ధురాలి.. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య అనారోగ్యంతో మహిళ..

వెల్గటూర్‌: వెల్గటూర్‌ మండలం స్తంభంపల్లిలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నరేశ్‌ మంచిర్యాలలో పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న అలివేలు అనే మహిళతో నరేశ్‌ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. నరేశ్‌ మంగళవారం సాయంత్రం గ్రామానికి రాగా.. కొద్దిసేపటికి సదరు మహిళ కూడా చేరుకుంది. ఇద్దరి మధ్య గొడవ జరిగి ఆవేశంలో నరేశ్‌ ఆ మహిళను రోకలిబండతో తలపై మోదాడు. అనంతరం కత్తితో మెడకోసి పారిపోయాడు. నరేశ్‌ గతంలో మంచిర్యాల ప్రాంతంలో ఓ మహిళను హత్య చేసి బంగారం దోచుకున్న కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. నరేశ్‌ నేర ప్రవృత్తి తెలిసి భార్యాపిల్లలు వదిలేసి వెళ్లారని సమాచారం. ఆ హత్యలో సహకరించిన అలివేలుతో అప్పటినుంచే నరేశ్‌ సహజీవనం చేస్తున్నాడని సమాచారం. హత్య విషయం తెలుసుకున్న సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు టూటౌన్‌ పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంతంలో బిక్షాటన చేసుకుంటూ ఉండేవాడని వివరాలు తెలిస్తే టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

రాయికల్‌: రాయికల్‌కు చెందిన తాటిపాముల దేవక్క (82) మానసికస్థితి సరిగా లేక ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందినట్లు ఎస్సై సుధీర్‌రావు తెలిపారు. దేవక్క కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పైగా మానసిక స్థితి సరిగా లేదు. మంగళవారం ఉదయం నుంచి కనిపించలేదు. కుటుంబ సభ్యులు దేవక్కకోసం గాలిస్తుండగా.. ఇంటి సమీపంలోని బావిలో శవమై తేలింది. దేవక్క కుమారుడు లక్ష్మణ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ధర్మపురి: మానసికంగా బాధపడుతున్న ఓ వ్యక్తి మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేష్‌ తెలిపారు. మండలంలోని నాగారం గ్రామానికి చెందిన మేడిశెట్టి తిరుపతి (35)కి కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేదు. తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేవాడు. వైద్యులను సంప్రదించి మందులు వాడినా నయం కాలేదు. జీవితంపై విరక్తితో ఊరుచివర డంపింగ్‌యార్డులో ఉరేసుకున్నాడు. తిరుపతికి భార్య మహేశ్వరి, ఇద్దరు పిల్లలున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన కొంపల్లి లక్ష్మి (45) అనారోగ్యం బాధ భరించలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలు.. లక్ష్మి కూలీ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండగా, భర్త ముత్యం సెస్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. లక్ష్మి గతంలో అనారోగ్యానికి గురికాగా వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. అయినా నయం కాలేదు. మంగళవారం ముత్యం అనారోగ్యంతో ఆపరేషన్‌ కోసం హైదరాబాద్‌ ఆస్పత్రికి వెళ్లగా, ఇంట్లో లక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement