గెలుపు వ్యూహాలు..
జగిత్యాల: గ్రామాల్లో ఎలాగైనా పాగా వేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ అభ్యర్థులు వ్యూహ రచనలు చేస్తున్నారు. ముఖ్యంగా కుల సంఘాలు, మహిళాసంఘాలు, యువతను ప్రసన్నం చేసుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపు కోసం అవకాశం ఉన్న ప్రతి అంశాలపైనా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. అన్ని వర్గాల వారిని ఎలా ఆకట్టుకోవాలో సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ గుర్తులు లేకున్నా.. ప్రధాన పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే కొన్నిచోట్ల రెబల్స్ బెడద కూడా తీవ్రంగా ఉంది. ఓట్లు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వీరి ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఖర్చు కన్నా ప్రజాబలం మిన్న కావడంతో ఎలాగైనా ఓటర్లను ఆకట్టుకునేలా అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. ప్రతి గ్రామాల్లో కుల సంఘాల నాయకుల పెద్దలను కలుస్తూ గంపగుత్తగా కులం ఓట్లు పడేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మహిళా సంఘాల సభ్యులను కలుస్తూ ఒకే వైపు మహిళలంతా ఓట్లు వేయాలని కోరుతున్నారు. కుల సంఘాల నాయకులు ఆచీతూచి సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. కొన్నిచోట్ల ఎలాగైనా ఓట్లు రాబట్టుకోవాలని డబ్బులు కూడా అందిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే మహిళ సంఘాలు, యువతకు కానుకల రూపంలో ముట్టజెప్పుతున్నారు. యువతకు క్రీడలకు సంబంధించిన కిట్లు, ఆట వస్తువులను అందజేస్తున్నారు.
సందడేసందడే..
జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ఈనెల 11న జరగనున్నాయి. రెండో విడత 14న, మూడో విడత 17న జరగనున్నాయి. మొదటి విడత ప్రచారానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో అభ్యర్థులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండో విడత, మూడో విడతకు ఇంకా సమ యం ఉన్నప్పటికీ సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. గ్రామాల్లో ఫ్లెక్సీలు కట్టడంతోపాటు, కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తికావడంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఉంగరం, కత్తెర, ఫుట్‌బాల్, చెత్తడబ్బా, నల్లబోర్డు, బ్యాట్, టీవీ తదితర గుర్తులు కేటాయిస్తున్నారు. కొన్ని గుర్తులు తెలియకుండా ఉన్నాయి. వాటి గురించి అభ్యర్థులు చెప్పుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. క్రికెట్ స్టంప్స్, గాలిబుడగ, బ్యాటరీలైట్, బిస్కట్, మంచం ఇలాంటి గుర్తులతో కొంత పరేషాన్ నెలకొంది. ఉంగరం, కత్తెర గతంలోనూ ఉండటంతో ఇవి ఫేమస్‌గా మారాయి. ఇవి వచ్చిన వారికి పెద్దగా ఇబ్బందులు లేనప్పటికీ కొత్త గుర్తులు మాత్రం అభ్యర్థులకు తలనొప్పిగానే మారాయి. అయినప్పటికీ గుర్తులపైనే ఫోకస్ చేసి ప్రచారం చేస్తున్నారు. కొన్ని గుర్తులు దగ్గరదగ్గర పోలి ఉండటంతో అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది.
గ్రామాలపై పట్టుకు అభ్యర్థుల యత్నం
కుల సంఘాలతో మంతనాలు
ఓటర్ల ప్రసన్నం కోసం సమావేశాలు
గెలుపు వ్యూహాలు..


