నిలిచిన రక్త నమూనాల రవాణా
జగిత్యాల: జిల్లాకేంద్రంలో తెలంగాణ డయాగ్నొస్టిక్స్ హబ్‌కు నిత్యం గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి అద్దె వాహనాల్లో రోగుల రక్త పరీక్షల శాంపిల్స్ తీసుకొస్తుంటారు. వీరు ల్యాబ్‌లో పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి రిపోర్ట్‌ను మెసేజ్ రూపంలో తిరిగి పంపుతుంటారు. అయితే తమకు బకాయిలు చెల్లించడం లేదంటూ అద్దె వాహనదారులు వారం రోజులుగా రవాణా నిలిపివేశారు. ఫలితంగా తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్‌కు రక్త శాంపిల్స్ రావడం లేదు. రోగులకు సంబంధించిన పరీక్షలు నిర్దారణ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
రోజుకు 300 శాంపిళ్లు రాక
జిల్లాలోని 27 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ప్రతిరోజు సుమారు 300 శాంపిల్స్ వస్తుంటాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం పీహెచ్‌సీలకు వెళ్తే అక్కడ వైద్యులు పరీక్షలు రాసి నిర్ధారణ కోసం శాంపిళ్లను తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్‌కు పంపిస్తుంటారు. వీరు పంపించిన నిర్ధారణ ఆధారంగానే అక్కడి వైద్యులు మందులు రాస్తుంటారు. అయితే వారం రోజులుగా శాంపిల్స్ నిలిచిపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. చలితీవ్రతతో వృద్ధులు, మహిళలు, పెద్దలు, వివిధ రోగాల బారిన పడుతున్నారు. వైద్యం కోసం పీహెచ్‌సీకి వస్తే ఈ పరిస్థితి నెలకొంది. బకాయిలు చెల్లించి వాహనాలను వెంటనే పునరుద్ధరించాలని రోగులు కోరుతున్నారు.
రూ.13.40 లక్షల బకాయిలు
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేకరించిన శాంపిళ్లను ఐదు అద్దె వాహనాల్లో తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు తరలిస్తుంటారు. ఒక వాహనానికి నెలకు రూ.33.5 వేల చొప్పున చెల్లిస్తుంటారు. అయితే అద్దె వాహనాలకు 8 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని, సుమారు రూ.13.40 లక్షల బకాయిలు నిలిచిపోయాయని తెలిసింది. శాంపిళ్లను తరలించే అద్దె వాహనాల సేవలను వారం నుంచి నిలిపివేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు వాహనాలను నడపబోమని తేల్చిచెప్పినట్లు తెలిసింది.
ఇబ్బంది పడుతున్న రోగులు
బకాయిలు చెల్లించడం లేదని.. అద్దెవాహనదారుల ఆందోళన


