నోటాకు పదిహేనేళ్లు
ప్రతీ ఊర్లో మనోళ్లు పోటీ చేయాల్సిందే..!
కరీంనగర్ అర్బన్/కరీంనగర్‌టౌన్: అవును.. నోటాకు 15 ఏళ్లు. ఎన్నికల్లో అభ్యర్థులు నచ్చనపుడు తెరపైకి వచ్చిన ఆప్షనే నోటా(నన్ ఆఫ్ ది ఎబొ). పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోతే ఆ అభిప్రాయం వ్యక్తీకరించే అవకాశం నోటా కల్పిస్తుంది. 2013 వరకు ఓటర్లకు అభ్యర్థులు నచ్చకపోయినా.. సరైన అభ్యర్థి పోటీలో లేరని భావించినా ఎవరికో ఒకరికి ఓటేయాల్సిన పరిస్థితి ఉండేది. అదే ఏడాది సెప్టెంబర్ 27న దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పుతో నోటా అమల్లోకి వచ్చింది. ఎన్నికల సంఘం ఈవీఎంలలో నోటా బటన్ అమర్చాక మొదటిసారి ఢిల్లీ, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ శాసనసభభ ఎన్నికల్లో శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో నోటా ఉంటోంది. రాష్ట్ర పంచాయతీరాజ్ సంస్థలు ఎన్నికల నిర్వహణ నియమావళిలో కూడా దీనిని పొందుపరిచారు. దీనిననుసరించి ప్రస్తుతం బ్యాలెట్ విధానంలో జరిగే పంచాయతీ ఎన్నికల్లోనూ బ్యాలెట్ పత్రంలో చివరి చిహ్నం నోటా ఉంటుందన్న మాట. పోటీలో ఉన్న అభ్యర్థులు నచ్చకుంటే దీన్ని ఉపయోగించండి.. అంతేకానీ పోలింగ్‌కు దూరంగా ఉండొద్దు.
పెద్దపల్లిరూరల్: పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ పడుతున్న అభ్యర్థుల ప్రచార ఖర్చుల ధరలను ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రచార ఖర్చుల రోజువారీ వివరాలను అధికారులకు ఎన్నికలు ముగిసిన 45 రోజుల్లోగా అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఖర్చుల వివరాలను ఇంతకన్న ఎక్కువ చూపితే అంగీకరించబోమని అధికారులు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం కోసం సైకిల్ రిక్షా వినియోగిస్తే రోజుకు రూ.400, అదే ఆటో రిక్షా అయితే రూ.1,500, టాటాఏస్ అయితే రూ.1,600గా నిర్ణయించారు. 100 యాంప్స్ మైక్‌సెట్‌కు రూ.2,500, వెయ్యి వాల్ పోస్టర్లకు రూ.5వేలుగా ప్రకటించారు. నెత్తిన ధరించే టోపీకి రూ.40, టీషర్ట్‌కు రూ.100 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. ఒకరోజుకు కారు అద్దెను రూ.2,500గా, ఇన్నోవాకు రూ.3,500గా చూపాల్సి ఉంటుందన్నారు. కూర్చునేందుకు వినియోగించే ఒక్కో కుర్చీకి రోజుకు రూ.20గా, వీఐపీ కుర్చీ అయితే రూ.100 అద్దెగా నిర్ణయించారు. కూల్‌డ్రింకు, వాటర్ బాటిల్‌కు రూ.20 చొప్పున, లస్సీకి రూ.35గా, వాటర్ పాకెట్‌కు రూపాయి, చాయ్‌కు రూ.10, కాఫీకి రూ.15 ధర చొప్పున లెక్క చూపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కిలో బరువున్న బాణసంచాకు రూ.800, ఒక డప్పుకు రూ.700 చొప్పున చెల్లించాలన్నారు. సాదా భోజనానికి రూ.80, మటన్ బిర్యానీకి రూ.150, చికెన్ బిర్యానీకి రూ.100 చొప్పున బిల్లు సమర్పించాల్సి ఉంటుందని వివరించారు.
జగిత్యాలజోన్: సర్పంచ్ ఎన్నికల్లో గెలిచినా సరే.. ఓడినా సరే.. కాని జిల్లాలోని ప్రతీ గ్రామంలో మనోళ్లు పోటీలో ఉండాల్సిందే అంటూ రాజకీయ పార్టీలు స్థానిక నాయకులకు హుకుం జారీ చేస్తున్నాయి. దీంతో రిజర్వేషన్‌కు అనుకూలంగా పోటీ చేసే నాయకుల కోసం అన్వేషిస్తున్నారు. స్థానిక నాయకుల ఒత్తిడితో పోటీ చేసేందుకు కొందరు ఆసక్తి చూపినా.. డబ్బుల్లేక వెనుకంజ వేస్తున్నారు. దీంతో ఆయా పార్టీల గ్రామస్థాయి నాయకులు తలా కొంత వేసుకొని పార్టీపరంగా అభ్యర్థి ఉండేలా చూస్తున్నారు. గ్రామంలో ఏదైనా పార్టీ తరఫున అభ్యర్థి లేడంటే.. ఆయా పార్టీల నియోజకవర్గ ఇన్‌చార్జీల వద్ద తలెత్తుకోలేమని స్థానిక నాయకులు భయపడుతున్నారు. ఇప్పటికే తొలి విడత నామినేషన్ వేసిన కొందరిని పోటీ నుంచి ఉపసంహరించేలా ప్రయత్నాలు జరుగుతుండడంతో.. అప్రమత్తంగా ఉండాలని ఆయా పార్టీల నాయకులు హెచ్చరిస్తున్నారు. స్థానిక నాయకులు గెలిచినా.. ఓడినా.. ఓ వర్గంగా బలంగా ఉంటేనే రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమకు అండగా ఉంటారని ఆయా పార్టీల నియోజకవర్గ ఇన్‌చార్జీలు భావిస్తున్నారు. దీంతో పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకున్నా.. తప్పనిసరిగా ప్రతీ పార్టీ తరఫున అభ్యర్థులుండేలా మండల, జిల్లాస్థాయి నాయకులు పల్లెల్లో సమావేశాలు పెడుతున్నారు. ప్రతీ చిన్న పల్లెలోనూ సర్పంచ్ పదవికి నలుగురైదుగురు పోటీ పడుతుండడం గమనార్హం.
ఎన్నికల ప్రచార ఖర్చులిలా..
నోటాకు పదిహేనేళ్లు
నోటాకు పదిహేనేళ్లు
నోటాకు పదిహేనేళ్లు


