టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం
రామడుగు(చొప్పదండి): రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి వెంకటేశ్(39) అనే యువకుడు టిప్పర్ ఢీకొని శనివారం రాత్రి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మండల కేంద్రంలో శనివారం రాత్రి మట్టిని తరలిస్తున్న టిప్పర్ బ్రేక్‌డౌన్ కాగా.. వెంకటేశ్ టిప్పర్ ముందు భాగాన పడుకొని మరమ్మతు చేస్తున్నాడు. ఇది గమనించని మృతుడి తమ్ముడు డ్రైవర్ నరేశ్ టిప్పర్‌ను స్టార్ట్ చేసి ముందుకు నడిపించాడు. వెంకటేశ్ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై కె.రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
దారి దోపిడీ దొంగల అరెస్ట్
జగిత్యాలక్రైం: దారి దోపిడీ దొంగతనాలకు పాల్పడ్డ ఇద్దరు నిందితులతోపాటు మరో మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మంచిర్యాల జిల్లా జెండావెంకటపూర్‌కు చెందిన తాళ్లపెల్లి నవీన్ శనివారం మంచిర్యాలలో తన డీసీఎం వాహనంలో వరి ధాన్యం నింపుకొని నిజామాబాద్ వెళ్లాడు. వరి ధాన్యం దింపి తిరిగి మంచిర్యాల వస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో జగిత్యాల గాంధీనగర్ సమీపంలో కాలకృత్యాల కోసం వాహనం ఆపి తిరిగి వాహనం ఎక్కుతుండగా.. ముగ్గురు వ్యక్తులు పల్సర్ మోటార్ సైకిల్‌పై వచ్చి నవీన్‌పై దాడి చేశారు. రూ.22వేల నగదు, మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. బాధితుడు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. పట్టణ సీఐ కరుణాకర్ నిందితులైన పెర్కపల్లి రోడ్డు సమీపానికి చెందిన ఎర్ర సాయి, గాంధీనగర్‌కు చెందిన నక్క గణేశ్‌ను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.22వేల నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మైనర్ బాలుడిని జువైనల్ కోర్టుకు తరలించారు. పోలీసులు 5 గంటల్లో కేసు ఛేదించారు.


