సర్పంచ్ గిరి.. ‘నల్లకోటు’ గురి
జగిత్యాలజోన్: ఉమ్మడి జిల్లాలో వివిధ కోర్టుల్లో దాదాపు 3,000 మంది న్యాయవాదులు ఉంటారు. ఎప్పుడు కోర్టుల్లో నల్లకోటు వేసుకుని, నాలుగు గోడల మధ్య ఉండే న్యాయవాదులు పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని ప్రజల్లోకి వెళ్లేందుకు ఆరాటపడుతున్నారు. దాదాపు 90 శాతం న్యాయవాదులు గ్రామాల నుంచి వచ్చి ఆయా కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్నవారే. ప్రజలతో ఉన్న సంబంధాలతో పాటు రిజర్వేషన్లు కూడా అనుకూలించడంతో పోటీకి సై అంటున్నారు. వివిధ కోర్టుల నుంచి ఐదారుగురు న్యాయవాదులు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. జగిత్యాల జిల్లాలో పోటీ చేసే న్యాయవాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. గత పంచాయతీ ఎన్నికల్లో కొంతమంది న్యాయవాదులు సర్పంచ్‌లుగా గెలుపొందగా, ఇప్పుడు వారిని చూసి మరికొందరు పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఆయా సామాజిక వర్గాల్లో పెద్దగా చదువుకున్న వారు లేకపోవడం, ఏదైనా సమస్య వస్తే గట్టిగా మాట్లాడేవారు కరువవడంతో న్యాయవాదులుగా ఉన్నవారిని పోటీ చేయాలని కులసంఘాలే డిమాండ్ చేస్తూ గ్రామాలకు పిలుస్తున్నాయి.


