కాంగ్రెస్‌కు కొత్త సారథులు
నాలుగు జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం కరీంనగర్, పెద్దపల్లిలో ఎమ్మెల్యేలకే పగ్గాలు ముగ్గురు బీసీలు, ఒక ఎస్సీకి పట్టం కరీంనగర్‌కు మేడిపల్లి, పెద్దపల్లికి మక్కాన్‌సింగ్ జగిత్యాలకు గాజెంగి, రాజన్న సిరిసిల్లకు సంగీతం కరీంనగర్ కార్పొరేషన్‌కు అంజన్‌కుమార్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీసీసీ అధ్యక్షుల నియామకానికి కాంగ్రెస్ పార్టీ పచ్చజెండా ఊపింది. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని 4 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, జగిత్యాల డీసీసీ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు గాజెంగి నందయ్య, రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు సంగీతం శ్రీనివాస్‌ను నియమించారు. అలాగే కరీంనగర్ కార్పొరేషన్‌కు సీనియర్ నాయకుడు వైద్యుల అంజన్‌కుమార్‌ను నియమించారు. ఆయా జిల్లాల రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల సమతుల్యత, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఏఐసీసీ వ్యూహాత్మక నిర్ణయంతో తుది ముద్ర వేసినట్లు తెలుస్తుంది.
కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం
కరీంనగర్‌కు ఎస్సీ, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలతోపాటు కరీంనగర్ కార్పొరేషన్‌కు బీసీలను అధ్యక్షులుగా నియమించారు. దీంతో ఆయా జిల్లాల కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. అదే పంథాల్లో కరీంనగర్ సిటీ అధ్యక్షుడిగా అంజన్‌కుమార్ నియామకంతో నగర కాంగ్రెస్‌లో ఉత్సాహం నెలకొంది. అంజన్‌కుమార్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్‌లోనే కొనసాగారు. ఉమ్మడి జిల్లాలో డీసీసీ, నగర అధ్యక్షుల నియామకాల్లో పార్టీ విధేయతకు పట్టం కట్టినట్లు తెలుస్తోంది. ఈ కొత్త నియామకాలతో కాంగ్రెస్ రాబోయే ఎన్నికలకు సమగ్రంగా సిద్ధమవుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జిల్లా, నగర స్థాయిల్లో కొత్త సారథులు రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ శిబిరంలో ఓ కొత్త ఊపు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపినట్లయింది. పార్టీలో అంతర్గతంగా నెలకొన్న చిన్నచిన్న విభేదాలను సర్దుబాటు చేయడమే కాకుండా, భవిష్యత్ ఎన్నికల వైపు దూసుకెళ్లేందుకు కాంగ్రెస్ పూర్తిగా సమాయత్తమవుతోందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


