రిజర్వేషన్లు ఖరారు
ఆశావహుల్లో ఉత్సాహం
జగిత్యాల/జగిత్యాలరూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ కూడా రావడంతో ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. ఇప్పటికే గ్రామపంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కొలిక్కి వచ్చాయి. సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించిన రిజర్వేషన్లు మొత్తం సీట్లలో 50 శాతం మించకుండా అధికారులు ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావడమే ఆలస్యం. ఇప్పటికే బీసీ డెడికేషన్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లాయంత్రాంగం రిజర్వేషన్లు లెక్కించి కేటాయించింది. సర్పంచులు, వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించగా.. అక్కడి నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలకు వెళ్లడం, నామినేషన్లు తీసుకోవడం కూడా పూర్తయ్యింది. హైకోర్టు తీర్పుతో అవి రద్దు కావడంతో రిజర్వేషన్ల కథ మళ్లీ మొదటికి వచ్చింది. తాజాగా ప్రకటించిన జాబితాలో ఎస్సీ, ఎస్టీ స్థానాలు అలాగే ఉండనుండగా.. బీసీ స్థానాల సంఖ్య మాత్రం తగ్గనుంది. బీసీలకు గతంలో ఉన్న 42 శాతంతోనే ఎన్నికలు జరగనుండగా.. వారిలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది.
అధికారులు బిజీబిజీ..
ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు రావడంతో నెల రోజులుగా కలెక్టరేట్‌లో బిజీబిజీగా ప్రక్రియ చేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో మహిళాస్థానాలను డ్రా పద్ధతిలో రిజర్వేషన్లు కే టాయించారు. ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయాల ని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడంతో అధికారులంద రూ లీనమైపోయారు. రెండుమూడు రోజుల్లో నోటిఫికేషన్ రానున్న తరుణంలో అన్ని సిద్ధం చేస్తున్నారు. ఓటరు తుదిజాబితా సోమవారం ప్రకటించనున్నారు. ఇప్పటికే అధికారులు జిల్లాలో అన్ని పోలింగ్ బూత్‌లు, బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చే సుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అధికారులు పూర్తిస్థాయిలో నిమగ్నం కానున్నారు.
గ్రామాల్లో సందడి..
సర్పంచుల పదవీకాలం ముగిసి రెండేళ్లు కావస్తు న్నా.. ఎన్నికలు నిర్వహించకపోవడంతో నాయకుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. బీసీలకు 42 శాతం కేటాయిస్తూ ఇటీవల ముందుకెళ్లినప్పటికీ కోర్టు తీర్పుతో ఆగిపోయింది. ప్రస్తుతం మళ్లీ ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో సందడి నెలకొంది. ఆశావహులు ఏవైనా రిజర్వేషన్లు మారాయా..? అని చర్చించుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్లు మారగా మిగతావన్ని అలాగే ఉన్న ట్లు తెలుస్తోంది. కలెక్టరేట్‌లో రెండు రోజులుగా ఆశావహులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో రాజకీయ నాయకుల సమక్షంలోనే రిజర్వేషన్లు తీయడంతో దాదాపు అందరికీ రిజర్వేషన్లు సైతం తెలిసిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. అధికారికంగా రిజర్వేషన్లు రాకపోయినప్పటికీ దాదాపు అన్ని మండలాలకు చెందిన రిజర్వేషన్లు తెలిసిపోయాయి.
రిజర్వేషన్లు ఇవే..
ఎస్టీలకు 22 స్థానాలు కేటాయించగా.. మహిళలకు 10, జనరల్ 12, జనాభా ప్రాతిపదికన జనరల్ 5, ఎస్సీలకు 72 కేటాయించగా మహిళలకు 31, జనరల్ 41, బీసీలకు 98 స్థానాలు కేటాయించగా.. మహిళలకు 44, జనరల్ 54 చొప్పున కేటాయించారు. జనరల్ స్థానాలు 188 కాగా.. ఇందులో మహిళలకు 89, జనరల్ 99 కేటాయించారు.
మొత్తం మండలాలు 20
గ్రామపంచాయతీలు 385
వార్డులు 3536
మొత్తం ఓటర్లు 6,07,263
పురుషులు 2,89,702
మహిళలు 3,17,552
ఇతరులు 9
ఏర్పాట్లు పూర్తి
జిల్లాలో 385 గ్రామ పంచాయతీలుండగా.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఓటరు జాబితా సిద్ధం అయ్యింది. పోలింగ్ బూత్‌లు, బ్యాలెట్ బాక్స్‌లు ఏర్పాటు చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్ ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి డీపీవోలకు ఆదేశాలు జారీ చేశారు.
ఆయా గ్రామాల్లో పోటీచేసే అభ్యర్థులు ఇప్పటికే తమ అనుచర వర్గాలతో సమావేశం ఏర్పాటు చేసి పోటీకి సన్నద్ధమవుతున్నారు. రిజర్వేషన్లు అనుకూలించని వారు అయోమయంలో పడిపోయారు. తాము బలపర్చిన అభ్యర్థిని నిలబెట్టుకుని గెలిపించుకోవాలనే ఆలోచనలో మరికొందరు ఉన్నారు. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ అభ్యర్థులు ఏయేవార్డుల్లో ఎవరిని పోటీలో దింపాలన్న అంశంపై ఇప్పటికే చర్చలకు తెరలేపారు. గతంలో కంటే సర్పంచ్‌గా పోటీచేసే అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికలు ముందుగా నిర్వహిస్తుండడంతో అభ్యర్థులు అన్ని విధాలా సిద్ధమవుతున్నారు.


