బాధ్యతలు స్వీకరించిన అడిషనల్ ఎస్పీ
జగిత్యాలక్రైం: అదనపు ఎస్పీగా శేషాద్రినిరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ అశోక్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శేషాద్రినిరెడ్డిది నల్గొండ జిల్లా చౌటుప్పల్ సమీపంలోని లింగారెడ్డి గూడెం. ఐఐటీ హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి 2020లో సివిల్స్ తొలి ప్రయత్నంలోనే 401వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం తొలి పోస్టింగ్ వేములవాడ ఎస్డీపీవోగా బాధ్యతలు స్వీకరించారు. బదిలీల్లో అడిషనల్ ఎస్పీగా వచ్చారు.
నేటి నుంచి అన్నప్రసాద వితరణ
మెట్‌పల్లి: పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో ఆదివారం నుంచి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు దొమ్మాటి ప్రవీణ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగుల వివేక్, ఉపాధ్యక్షుడు అంకతి భరత్ తెలిపారు. జనవరి 7 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, మధ్యాహ్నం 12.30 నుంచి మూడు గంటల వరకు భిక్ష ఉంటుందన్నారు. దీక్షాస్వాములు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
నేడు ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
జగిత్యాల: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈనెల 23న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో రాము తెలిపారు. జిల్లాలోని ఆరు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష ఉంటుందని, జగిత్యాలలో మూడు, కోరుట్లలో రెండు, మెట్‌పల్లిలో ఒకటి చొప్పున పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని, 1,474 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు.
చేపల పెంపకంతో మత్స్యకారులకు ఆదాయం
ధర్మపురి: చేపపిల్లల పెంపకంతో మత్స్యకారులకు ఆదాయం సమకూరుతుందని మత్స్యశాఖ అధికారి సురేశ్‌బాబు అన్నారు. మండలంలోని 25 గ్రామాల్లోని 42 చెరువుల్లో 4.20 లక్షల చేపపిల్లలను పంపిణీ చేశారు. ఆరు నెలల్లో చేపల్లో పెరుగుదల ఉంటుందని, వాటితో ఆదాయం సమకూర్చుకోవచ్చని సూచించారు.
మండలానికో భూసార పరీక్ష కిట్
జగిత్యాలఅగ్రికల్చర్: భూసార పరీక్షలు నిర్వహించేందుకు ప్రతి మండలానికో కిట్‌ను అందించామని డీఏవో వడ్డెపల్లి భాస్కర్ తెలిపారు. వ్యవసాయ అధికారి కార్యాలయంలో శనివా రం ఏఈవోలకు కిట్లపై అవగాహన కల్పించారు. కరీంనగర్ సాయిల్ టెస్టింగ్ ల్యాబోరేటరీ ఏవోలు తిరుమలేశ్వర్, మమత ప్రయోగాత్మకంగా సాయిల్ టెస్టింగ్ కిట్ ఉపయోగించే టెక్నిక్స్, భూసార శాంపిలింగ్ విధానం, పరీ క్షా ఫలితాలు, రైతులకు ఇవ్వాల్సిన సిఫార్సులపై అవగాహన కల్పించారు. ఏడీఏ టెక్నికల్ రాజులనాయుడు, ఏఓలు పాల్గొన్నారు.
చలికాలం జాగ్రత్త
జగిత్యాల: ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. కూల్ వేవ్ కారణంగా శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం, హైపోథర్మియా ఫాస్ట్ బైట్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని, ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్డు మీద పనిచేసే కార్మికులు, హోమ్‌లెస్ వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని, పూర్తిగా శరీరమంతా వేడిబట్టలు, మాస్క్‌లు ధరించాలన్నారు.
జాతీయ డైమండ్ జూబ్లీ జంబూరికి విద్యార్థినులు
పెగడపల్లి: స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్‌లో భాగంగా మండలంలోని సుద్దపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి నలుగురు విద్యార్థినులు జాతీయ డైమండ్ జూబ్లీ జంబూరికి ఎంపికై నట్లు స్కౌట్ టీచర్ పద్మజ తెలిపారు. ఎస్.ఐశ్వర్య, ఎస్.చంద్రలాస్య, ఎన్.దీప్తి, జీ.హర్షిణితోపాటు మల్యాల నుంచి ఇద్దరు, జగిత్యాల నుంచి ఇద్దరు మొత్తంగా ఎనిమిది మంది విద్యార్థినులు ఎంపికయ్యారని, వీరు ఈ నెల 23 నుంచి 29 వరకు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగే క్యాంపులో పాల్గొంటారని తెలిపారు.
బాధ్యతలు స్వీకరించిన అడిషనల్ ఎస్పీ


