వనితర సాధ్యం!
● అన్నింటా ‘రాణి’స్తున్నారు ● అతివల బహుముఖ బాధ్యతలు
అతివలు.. అనితర సాధ్యులంటే అతిశయోక్తి కాదేమో.. క్రమశిక్షణతో కూడిన యూనిఫామ్ ఉద్యోగాలు చేస్తూ.. ఎప్పుడే నిమిషంలో పిలుపు వస్తుందో తెలియని ఒత్తిడితో కూడిన విధులు నిర్వహిస్తూనే తమ ఇంటి పురోగతికి, పిల్లల భవిష్యత్తుకు అదేస్థాయిలో శ్రమిస్తున్నారు. పురుషులతో సమానంగా విధులు నిర్వహిస్తూనే ఇంటిని చక్కదిద్దుకుంటున్నారు.. బరువైన బాధ్యతలను అవలీలగా పోషిస్తూ అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. ఈనేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పోలీసులు, వైద్యులు, కండక్టర్లు, లాయర్లుగా రాణిస్తున్న పలువురు మహిళలపై కథనం.
రిస్క్ సక్సెస్‌తోనే రిలాక్స్
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): రిస్క్ సక్సెస్‌తో రిలాక్స్ అవుతానంటోంది ఏఎస్సై నీలిమ. కాల్వశ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా పని చేస్తున్న ఆమె ఉద్యోగం, కుటుంబం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ విధులు నిర్వహిస్తున్నానని చెప్పారు. గొడవపడి స్టేషన్‌కు వచ్చే భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇద్దరినీ ఒక్కటి చేసినప్పుడు ఆ ఆనందం మాటల్లో చెప్పలేనంటోంది. ట్రాన్స్‌పోర్టు(సరుకుల రవాణా)కు వెళ్లే భర్త, ఇద్దరు పిల్లలను స్కూల్‌కు తయారు చేయడం, వారికి లంచ్ బాక్స్ రెడీ చేసి విధులకు రావడంలో తల్లి, కుటుంబ సభ్యుల సహకారం ఉంటుదని తెలిపారు.


